కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!

కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!

భారత ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23న ముగియనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ కోసం కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును సిఫారసు చేయాలని సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ను కోరుతూ కేంద్ర న్యాయశాఖ లేఖ రాసింది. 

గురువారం సాయంత్రం లేదా శుక్రవారం నాటికి పేరును పంపాలని కోరింది. నిబంధనల ప్రకారం ప్రస్తుత సీజేఐ తర్వాత సీనియర్‌గా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తికి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం లభిస్తుంది. ఈ మేరకు తగిన సమయంలో కేంద్ర న్యాయ శాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా  సీజేఐ పదవీ విరమణకు నెల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

జస్టిస్ గవాయ్ తర్వాత జస్టిస్‌ సూర్యకాంత్‌ సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయనకే  సీజేఐగా అవకాశం దక్కనుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్ నియమితులైతే నవంబరు 24న ఆయన బాధ్యతలు చేపడతారు.  ఆయన దాదాపు 15నెలల పాటు అంటే 2027 ఫిబ్రవరి 29 వరకూ సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.

1981లో అక్కడి ప్రభుత్వ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్, 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ యూనివర్శిటీలో లా డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం హిసార్‌లోనే న్యాయవాద వృత్తి మొదలుపెట్టారు. 1985లో పంజాబ్‌ హరియాణా హైకోర్టులో ప్రాక్టీసు చేయడం కోసం ఛండీగడ్‌కు వెళ్లారు. ఆ తర్వాత 2000 జులై 7న అత్యంత పిన్నవయస్సులో హరియాణా అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 2004 జనవరి 9న పంజాబ్‌ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.

 అనంతరం 2018 అక్టోబరు 5న హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకున్నారు. దీంతో పాటు 2024 నవంబరు 12 నుంచి సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు.