రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ వికాసానికి, ఇండియా కూటమి వినాశనానికి మధ్య జరిగే పోరాటంగా మారుతుందని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఓ పరాన్నజీవితో పోల్చారు. అది ఎవరితో కలిస్తే వారినే చివరికి నాశనం చేసే స్వభావం ఉన్న పార్టీగా పేర్కొన్నారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జేపీ నడ్డా ప్రసంగిస్తూ, విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు.
‘లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ అంటే దోపీడీ, జంగల్‌రాజ్, దాదాగిరీకి సంకేతం. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, వలసలను తగ్గించడం వంటి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన హామీలు వింటే నాకు ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం గుర్తుకు వస్తోంది’ అని ఎద్దేవా చేశారు. “ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పడం అబద్ధం. జీతాల కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? ఆ పార్టీ పాలనలో అవినీతి, అన్యాయం తప్ప మరేమీ జరగలేదు” అని ధ్వజమెత్తారు.
“గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దివంగత ఎండీ షాబుద్దీన్ కుమారుడు ఒసామాకు ఆర్జేడీ టికెట్ ఇవ్వడం అనేది బిహార్ పట్ల ఆ పార్టీ ఎంత శ్రద్ధ వహిస్తుందో తెలుస్తోంది. అవినీతి, నేరాల పట్ల సానుభూతి ఉన్న పార్టీగా ఆర్జేడీ మరోసారి తేలిపోయింది” అని జేపీ నడ్డా ఆరోపించారు. బిహార్లో 20 సంవత్సరాల చీకటి యుగం గురించి తనకు తెలుసని జేపీ నడ్డా చెప్పారు. ‘నేను బిహార్‌లోని పట్నాలో జన్మించానని చాలా తక్కువ మందికి తెలుసు. నేను నా బాల్యం నుంచి 20 సంవత్సరాలు బిహార్‌లో గడిపాను. ఆ చీకటి యుగం గురించి నాకు తెలుసు. అలాగే ప్రస్తుత ఈ వెలుగు యుగాన్ని కూడా చూస్తున్నా’ అని తెలిపారు.
“ఈ ఎన్నికలు అభివృద్ధికి, విధ్వంసానికి మధ్య జరిగే పోరు. ఎన్డీఏ అభివృద్ధి ప్రభుత్వం. ఈ కొత్తగా ప్రకటించిన ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆ పార్టీ బిహార్ వినాశనానికి తప్ప మరొకటి కాదు. లాలూ ప్రసాద్ పాలనలో బిహార్ ప్రజలు వలస వెళ్లే పరిస్థితి ఎదుర్కొన్నారు” అని హెచ్చరించారు. “గత 20 ఏళ్లల్లో నీతీశ్ కుమార్, 11 సంవత్సరాల్లో ప్రధాని మోదీ ఆశీర్వాదంతో బిహార్ వేగవంతమైన పురోగతి వైపు పయనించింది. ఇటీవల బిహార్ కోసం ఎన్డీఏ ప్రభుత్వం చాలా చేసింది. రైల్వే బడ్జెట్‌ను 10 రెట్లు పెంచింది. దేశంలోని 44 వందే భారత్ రైళ్లలో 26 బిహార్ నుంచి నడిచేవి ఉన్నాయి” జేపీ నడ్డా వివరించారు.

More Stories
ఢిల్లీ పేలుడు కిరాతక ఉగ్ర ఘాతుకం
డిసెంబర్ 6న భారీ ఉగ్రదాడికి ఉమర్ కుట్ర
26/11 ఉగ్రదాడి తరహా 200 ఐఈడీలతో ఢిల్లీలో దాడులకు కుట్రలు