తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు

తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
* డిజిపి కార్యాలయం వద్ద రామచందర్​రావుతో సహా పలువురి అరెస్ట్
గోరక్షకుడు సోనాసింగ్ పై కాల్పుల ఘటనపై డిజిపికి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన తనతో పాటు సుమారు వంద మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను డిజిపి కార్యాలయం వద్ద అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నది రేవంత్ రెడ్డి సర్కారు కాదు.. రేవంతుద్దీన్ సర్కారు అని  రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎం రామచందర్ రావు ధ్వజమెత్తారు. 
 
ఎంఐఎం గూండాలను కాపాడటానికే రేవంత్ సర్కారు ఉందా? నిన్న గోరక్షకుడు ప్రశాంత్ (సోనూసింగ్)పై ఆవుల అక్రమ రవాణా మాఫియా కాల్పులు జరిపితే, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం గోరక్షకుడిపై అభాండాలు మోపి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. అంటూ ఆయన ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.


గోరక్షకుడు సోనూ సింగ్ పై కాల్పుల ఘటన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం అందించేందుకు బయల్దేరిన క్రమంలో, తనతో పాటు సుమారు 100 మంది బిజెపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కి తరలించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గోవులను తరలిస్తుండగా ఘట్కేసర్ వద్ద అడ్డుకోవడంతో, ఎంఐఎం కు చెందిన గూండాలు జరిపిన కాల్పుల్లో సోనూ సింగ్ తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

 

అయితే సోనూ సింగ్ పై లేనిపోని అభాండాలతో, కేసు సెటిల్‌మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న బాధితుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణం అంటూ రామచందర్ రావు తీవ్రంగా విమర్శించారు. అదే విధంగా, ఈ ఘటనపై తాము డీజీపీతో మాట్లాడటానికి వెళ్తుంటే అరెస్ట్ చేయడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, గోవుల సంరక్షణ కోసం కొత్తగా పాలసీ తెస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు గోవులను కోసేవాళ్లకు గన్ లైసెన్సులు ఇస్తోందా? అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గోవులను తరలించే గుండాలను, మాఫియా రెచ్చిపోతోందని,  గోరక్షకులపై అనేక దాడులు పెరిగాయని ఆయన విమర్శించారు.

దానికి పరాకాష్టగా పాత బస్తీ నుంచి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తి ప్రశాంత్ (సోనూ సింగ్)ను కాల్చి చంపే ప్రయత్నం చేయడమే అని తెలిపారు. అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎటు వైపు ఆలోచిస్తున్నదో ప్రజలు అర్థం చేసుకోవాలని బిజెపి నేత కోరారు. ఈ ఘటనకు సంపూర్ణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని స్పష్టం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు.
తెలంగాణలో ప్రభుత్వం గోవధ నిషేధ చట్టం తీసుకురావాలని కోరుతూ లేనిపక్షంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా, గో సంరక్షకుడు సోనూసింగ్పై దాడి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని బీజేపీ నాయకులు విమర్శించారు. కబేళాల నిర్వాహకులు, గోవులను అక్రమంగా తరలించే వారు, మాంసం విక్రేతలు గోరక్షకులపై కక్ష గట్టి దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మజ్లిస్ ఆగడాలు పెరిగిపోయాయని, ఆ పార్టీ కార్యకర్త ఇబ్రహీం కక్ష గట్టి సోనూసింగ్పై కాల్పులు జరిపాడని వారు ధ్వజమెత్తారు. ప్రభుత్వం గూండాలకు రక్షణగా నిలుస్తోందని మండిపడ్డారు. ఇదే విధంగా కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.