ఏఐతో డీప్‌ఫేక్‌, కృత్రిమ కంటెంట్‌ లపై కేంద్రం కొరడా

ఏఐతో డీప్‌ఫేక్‌, కృత్రిమ కంటెంట్‌ లపై  కేంద్రం కొరడా
కృత్రిమమేధ (ఏఐ) సహాయంతో తప్పుడు సమాచారాన్ని, డీప్‌ఫేక్‌ ఆడియో, వీడియోలను రూపొందించి జనాల్ని మోసగిస్తున్న ఘటనలు పెరిగిపోతున్న దృష్ట్యా వాటి కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఈ మేరకు ఐటీ నిబంధనల చట్టం, 2021కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ఐటీ శాఖ బుధవారం ముసాయిదాను విడుదల చేసింది. 
ఏఐ ద్వారా సృష్టిస్తున్న డీప్‌ఫేక్‌ వంటివి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజలను మోసగిస్తున్నాయని, వ్యక్తులను అప్రతిష్ఠపాలు చేస్తున్నాయని, ఆర్థిక మోసాలకు కారణమవుతున్నాయని, ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తున్నాయని ఐటీ శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది. దీనిని నివారించటం కోసం ముసాయిదా ప్రతిపాదనలు తయారుచేశామని తెలిపింది. 
 
కనీసం 50 లక్షల ఖాతాదారులున్న సోషల్‌ మీడియా సంస్థలు, ఇతర ప్లాట్‌ఫామ్స్‌కు ఈ నియంత్రణలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ ముసాయిదా నిబంధనల ప్రకారం నిజమైన సమాచారంలాగే భ్రమింపజేసేలా అల్గారిథమ్‌ ఆధారంగా, కంప్యూటర్‌ ద్వారా తయారుచేసే కంటెంట్‌ను ‘సింథటికల్లీ జెనరేటెడ్‌ కంటెంట్‌’ (కృత్రిమంగా సృష్టించిన అంశాలు)గా పిలుస్తారు. 
 
ఈ తరహా కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేసే వ్యక్తుల నుంచి ఇది కృత్రిమ కంటెంట్‌ అనే అంగీకారపత్రాన్ని సోషల్‌ మీడియా సంస్థలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఫేక్‌ ఆడియో, వీడియో సమాచారాన్ని వినియోగదారులు గుర్తించి జాగ్రత్తపడేలా వాటి మీద ‘ఇది కృత్రిమ కంటెంట్‌’ అనే హెచ్చరిక కనిపించాలి/వినిపించాలి. వీడియోకైతే అది కనిపించే తెర మీద 10 శాతం స్థలంలో ఈ హెచ్చరిక ఉండాలి. 
 
ఆడియో అయితే మొత్తం వ్యవధిలో తొలి 10 శాతం వ్యవధి మేర హెచ్చరిక వినిపిస్తూ ఉండాలి. కృత్రిమ కంటెంట్‌ను గుర్తించి, దానిపై నిర్దేశితస్థాయిలో హెచ్చరిక లేబుల్‌ ఉండేలా సోషల్‌ మీడియా సంస్థలు సాంకేతికపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ ముసాయిదా ప్రతిపాదనలపై అభిప్రాయాల్ని, సూచనల్ని నవంబరు 6వ తేదీ వరకూ తమకు పంపించవచ్చని ఐటీ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. 
ప్రతిపాదిత ఐటీ నియమం 3(3) ప్రకారం, కృత్రిమంగా (సింథటిక్​) తయారు చేసిన కంటెంట్​ను సృష్టించడానికి వీలు కల్పించే సోషల్ మీడియా ప్లాట్​ఫారమ్​లు కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అవి ఏమిటంటే, ఏఐ, డీప్​ఫేక్​ కంటెంట్​కు కచ్చితంగా ‘శాశ్వతమైన ప్రత్యేక మెటాడేటా లేదా ఐడెంటిఫైయర్’​తో లేబులింగ్ పొందుపరిచేలా చూసుకోవాలి. పైగా ఆ ఐడెంటిఫైయర్ స్పష్టంగా​ కనిపించేలా లేదా వినగలిగేలా ఉండాలి.
 
కాగా, సైబర్‌మోసాల నుంచి వినియోగదారుల్ని రక్షించటానికి కొత్త యాంటీ స్కామ్‌ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు మెటా ప్రకటించింది. భారత్​లో 5 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులు కలిగిన ​ఎస్​ఎస్​ఎంఐలు ఉన్నాయి. వీటిలో ఫేస్​బుక్​, యూట్యూబ్​, స్నాప్​ మొదలైన ప్లాట్ ఫారమ్స్​లు 2021 ఐటీ నిబంధనల ప్రకారం అదనపు సమ్మతికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
 
ఏఐ, డీప్​ఫేక్ ద్వారా నిడిచే తప్పుడు సమాచారాన్ని అరికట్టడం, ప్రజలను వంచనకు గురికాకుండా తప్పించడం, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే పరిస్థితులను నివారించడమే లక్ష్యంగా ఈ తాజా ప్రతిపాదనలు చేసినట్లు ఎలక్ట్రానిక్స్​, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ తెలిపింది.  ఓపెన్​గా, సురక్షితమైన, విశ్వసనీయమైన, జవాబుదారీ ఇంటర్నెట్​ను నిర్వహించడానికి ఈ చర్యలు తప్పనిసరి అని పేర్కొంది. అంతేకాదు, ఈ ముసాయిదాపై స్టేక్​హోల్డర్స్​ తమ అభిప్రాయాన్ని 2025 నవంబర్​ 6 లోపు తెలియజేయాలని సూచించింది. ఇందుకోసం itrules.consultation@meity.gov.in ద్వారా ఈ-మెయిల్ చేయవచ్చని సూచించింది.