హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు:

హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు:

* డిజిపి కార్యాలయం ఎదుట బిజెపి నిరసన నేడే!

మేడ్చల్ జిల్లాలోని యంనంపేటలో గోరక్షాదళ్ సభ్యుడు సోనూ సింగ్ అలియాస్‌ ప్రశాంత్‌పై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన మంగళవారం రాత్రి కలకలం రేపింది. కీసర మండలం రాంపల్లికి‌‌ చెందిన సోనూ సింగ్ కొన్ని రోజులుగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.  ఈ క్రమంలో బుధవారం కారులో ఇంటి నుంచి ఘట్‌కేసర్‌కు వస్తున్న క్రమంలో బహుదూర్‌పురకు చెందిన వ్యక్తి వెంబడించాడు. యంనంపేట వద్ద కారును అడ్డగించి అతడితో వాగ్వాదానికి‌ దిగాడు.

పశువులను అక్రమంగా రవాణా చేస్తోన్నారనే సమాచారం అందడంతో ప్రశాంత్ తో పాటు మరో ఇద్దరు ఘట్కేసర్ నుంచి పోచారం వెళుతున్న ఆ వాహనాన్ని వెంబడించారు. పోచారం వద్ద అడ్డుకున్నారు. పశువులను తరలించడానికి అవసరమైన అనుమతి పత్రాలను చూపించాలని అడిగారు. వారి వద్ద అలాంటి డాక్యుమెంట్లేవీ లేవు. 
 
దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో వాహనంలో ఉన్న ఇబ్రహీం ఖురేషి అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరపాడు. ఓ బుల్లెట్ ప్రశాంత్‌కు తగిలింది. దీంతో రక్తమోడుతూ అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ప్రశాంత్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
శరీరంలో ఉన్న బుల్లెట్‌ను తొలగించడానికి సర్జరీ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనపై పోచారం పోలీసులు, ప్రత్యేక ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటి), క్రైమ్ టీమ్స్‌తో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.  క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. ఐటీ విభాగం సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటాను విశ్లేషించడం ద్వారా నిందితుడిని గుర్తించడంలో నిమగ్నమైంది. రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్ బాబు, మల్కాజిగిరి డీసీపీ పీవీ పద్మజ సంఘటన స్థలాన్ని సందర్శించారు. దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. 
ఈ సంఘటనపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  గో రవాణా మాఫియా, ఏఐఎంఐఎం ప్రమేయం ఉందని ఆరోపిస్తూ తక్షణ న్యాయం కావాలని, మాఫియా కార్యకలాపాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సోను తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.  అయిదారు సంవత్సరాలుగా తన కుమారుడు అక్రమ గోవుల రవాణాను అడ్డుకుంటోన్నాడని ఆమె తెలిపారు.


కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ గోవుల రవాణా మాఫియా కార్యకలాపాలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని ఆరోపించారు. డీజీపీ, ఇతర అధికారులతో మాట్లాడాననని పేర్కొంటూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఇటీవలే నిజామాబాద్‌లో ఓ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడని గుర్తు చేశారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న మాఫియా కార్యకలాపాలను, గోవులను అక్రమంగా రవాణా చేసేవారిని, వధించేవారిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. 
 
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను భయపెట్టడానికి ఏఐఎంఐఎం గూండాలే ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. గోవుల అక్రమ రవాణా గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఉందని ఆరోపించారు. ఎంఐఎం కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వెసలుబాటు వల్లే వాళ్లు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఈ దాడికి నిరసనగా బీజేపీ డిజిపి కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనకు పిలుపిచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఇతర నాయకులు ఈ నిరసనలో పాల్గొంటారు.  శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తూ గాయపడిన వ్యక్తిపై దాడి జరగడాన్ని రామచందర్ రావు తీవ్రంగా విమర్శించారు.  బాధితుడి ఆరోగ్యంపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ, అతనికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఇటువంటి హింసాత్మక చర్యలను ఎప్పటికీ సహించదని స్పష్టం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం‌ను డిమాండ్ చేశారు.