15-16 శాతానికి అమెరికా సుంకాలు తగ్గే అవకాశం!

15-16 శాతానికి అమెరికా సుంకాలు తగ్గే అవకాశం!

భారత్‌, అమెరికా వాణిజ్య ఒప్పందానికి చేరువైనట్లు తెలుస్తోంది. వ్యవసాయం, డైరీ సంబంధిత రంగాల్లో అమెరికాకు మార్కెట్‌ను తెరవడంపై ఏర్పడిన ప్రతిష్ఠంభన, రష్యా చమురు కొంటున్నారనే సాకుతో భారత్‌పై ట్రంప్‌ విధించిన అధిక టారిఫ్‌లు త్వరలోనే దిగివస్తాయనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తోంది.  వాణిజ్య ఒప్పందంపై భారత్‌-అమెరికా మధ్య కొన్నినెలలుగా జరుగుతున్న చర్చలు కొలిక్కివస్తున్నట్లు తెలుస్తోంది.

ఇరుదేశాలు ఒప్పందానికి చేరువైనట్లు సమాచారం. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన సమయంలో ఈ అంశంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్‌ నుంచి చేసుకుంటున్న దిగుమతులపై అగ్రరాజ్యం విధిస్తున్న సుంకాలు ప్రస్తుతం ఉన్న 50 శాతం నుంచి 15-16 శాతానికి తగ్గుతాయని తెలుస్తోంది.

వ్యవసాయం, డైరీ రంగాల్లో అమెరికా నుంచి వచ్చే వస్తువులకు భారత్‌ మార్కెట్‌ను తెరవాలని పట్టుబట్టడం వల్ల ఇరు దేశాల మధ్య ఒప్పందం సాధ్యపడలేదు.  ఇందుకు ప్రతీకారంగా భారత్‌పై ట్రంప్‌ 25శాతం సుంకాలు విధించారు. అయినప్పటికీ భారత్ దారికిరావడంలేదనే ఆగ్రహంతో రష్యా నుంచి చమురును కొంటున్నారంటూ మరో 25 శాతం సుంకాలు విధించారు.

రష్యా నుంచి అన్ని దేశాల కంటే అధికంగా చమురు కొంటున్న చైనాను వదిలిపెట్టి కేవలం భారత్‌పైనే సుంకాలు విధించడంపై విమర్శలు వ్యక్తమైనా ట్రంప్‌ తగ్గలేదు.  అయితే అమెరికా ఒత్తిడికి భారత ప్రభుత్వం తలవంచలేదు. దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తామని ప్రధాని మోదీ పలు సందర్భాల్లో తేల్చిచెప్పారు. సుంకాలు విధించినప్పటికీ ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతూనే ఉన్నాయి.

అమెరికా ప్రతినిధి బృందం భారత్ వచ్చి చర్చలు జరపగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లి అక్కడి ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు.  ఎట్టకేలకు ఇరుదేశాలు వాణిజ్య ఒప్పందానికి చేరువైనట్లు ఈ అంశంతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారులు చెప్పారని జాతీయ మీడియా సంస్థ మింట్ కథనం వెలువరించింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ రష్యా నుంచి కొంటున్న చమురును క్రమంగా తగ్గించుకుంటుందని మింట్ తెలిపింది. 

అలాగే అమెరికా నుంచి నాన్‌ జెనిటికల్‌ మొక్కజొన్న, సోయామీల్‌ను భారత్‌ అనుమతించవచ్చని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు మింట్ సంస్థ పేర్కొంది. టారిఫ్‌లపై, మార్కెట్‌ను అందుబాటులో ఉంచడంపై కాలానుగుణంగా సమీక్ష జరిపేందుకు ఒక యంత్రాంగం ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని తెలిపింది.  అయితే, ఈ అంశంపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖకానీ, శ్వేతసౌధంకానీ స్పందించలేదు. అన్నీ కుదిరితే ఈనెలలో జరిగే ఆసియాన్ సదస్సులో ఒప్పందంపై ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం.

మరోవైపు దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, వాణిజ్య ఒప్పందంపైనే చర్చలు జరిపినట్లు సమాచారం. వాణిజ్యం, ఇంధనం అంశాలపై మోదీతో మాట్లాడినట్లు మంగళవారం శ్వేతసౌధంలో దీపావళి జరుపుకొన్న అనంతరం ట్రంప్ వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోలును పరిమితం చేయనున్నట్లు మోదీ హామీ ఇచ్చారని కూడా చెప్పారు.

ట్రంప్‌ ఫోన్ చేసిన విషయాన్ని ధ్రువీకరించిన ప్రధాని మోదీ, చర్చల సారాంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. దీపావళి శుభాకాంక్షలు చెప్పారని మాత్రమే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఇరుదేశాలు ఐక్యంగా నిలబడాలని పేర్కొన్నారు.