గూగుల్‌పై నల్లుల దండయాత్ర

గూగుల్‌పై నల్లుల దండయాత్ర

ప్రపంచ టెక్ దిగ్గజం, గూగుల్ అంటే ఇన్నోవేషన్, హై-టెక్ ఎన్విరాన్‌మెంట్ గుర్తొస్తుంది. కానీ, న్యూయార్క్ నగరంలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా అత్యంత చిన్న, సాధారణ సమస్య అయిన నల్లుల బెడద వదల్లేదు! మాన్‌హట్టన్‌లోని ప్రముఖ చెల్సియా క్యాంపస్‌లోని గూగుల్ ఆఫీస్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో, గూగుల్ సంస్థ ఆఫీసును తాత్కాలికంగా మూసివేసి, అక్కడి ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చింది.

నెల 19న గూగుల్‌కు చెందిన పర్యావరణ, ఆరోగ్యం, భద్రతాధికారులు ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్ పంపారు. ఆఫీసులో నల్లుల బెడద ఉన్నట్లుగా స్నీపర్ డాగ్ (నల్లులను గుర్తించేందుకు శిక్షణ పొందిన కుక్క) పసిగట్టినట్లుగా అందులో పేర్కొన్నారు. దీంతో, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఎవరూ ఆఫీసుకు రావద్దని ఆదేశించారు. 

ఈ నేపథ్యంలో, కార్యాలయాన్ని శుభ్రపరిచే చర్యలు వేగంగా చేపట్టారు. సోమవారం నుంచి మాత్రమే ఆయా ఉద్యోగులు తిరిగి ఆఫీసుకు వచ్చేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది.  నల్లుల వ్యాప్తికి కారణం ఏమై ఉంటుందా? అని కార్యాలయ వర్గాలు ఆరా తీయగా న్యూయార్క్ గూగుల్ ఆఫీసులో పెద్ద మొత్తంలో ఉంచిన జంతువుల బొమ్మల  ద్వారా అవి వ్యాపించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

నల్లుల బెడద నుంచి ఉద్యోగులు అప్రమత్తంగా ఉండేందుకు, ఎవరికైనా దురద లాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే సంస్థకు తెలియజేయాలని కోరింది. అంతేకాదు, తమ ఇళ్లల్లో కూడా నల్లులు కనిపించినట్లయితే వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే న్యూయార్క్‌లోని గూగుల్‌ ఆఫీసులో ఇలాంటి నల్లుల బెడద చోటుచేసుకోవడం ఇది రెండోసారి. సరిగ్గా 2010లో కూడా ఇదే తరహాలో నల్లులు తమ ఆఫీస్‌ను చుట్టుముట్టాయి.