శ్రీరాముడే స్ఫూర్తిగా ఆపరేషన్‌ సింధూర్‌

శ్రీరాముడే స్ఫూర్తిగా ఆపరేషన్‌ సింధూర్‌

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే, తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆపరేషన్ సింధూర్​కు శ్రీరాముడే స్ఫూర్తి అని తెలిపారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళిని శక్తి , ఉత్సాహంతో నిండిన పండుగగా అభివర్ణించారు. ఈ క్రమంలో దేశప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

“అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం తర్వాత ఇది మనకు రెండో దీపావళి వేడుక. శ్రీరాముడు మనకు ధర్మాన్ని నిలబెట్టమని బోధించాడు. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ధైర్యాన్ని కూడా ఇచ్చాడు. కొన్ని నెలల క్రితం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్​కు శ్రీరాముడే స్పూర్తి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే, తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంది” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 

అలాగే దేశ ప్రజలకు రాసిన లేఖలో నక్సలిజం, ఆపరేష్ సిందూర్ విజయం, జీఎస్టీ సంస్కరణలు తదితర అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశంలోని పలు జిల్లాల్లో నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడంతో మారుమూల ప్రాంతాలు సహా అనేక జిల్లాల్లో మొదటిసారి దీపావళి వెలుగులు వెలిగాయని తెలిపారు.

“ఈ దీపావళి చాలా ప్రత్యేకం. ఎందుకంటే నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించిన తర్వాత మొదటిసారిగా దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలతో దీపాలు వెలిగించారు. ఇటీవలి కాలంలో మన దేశ రాజ్యాంగంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, హింస మార్గాన్ని విడిచిపెట్టి చాలా మంది జన జీవన స్రవంతిలోకి వచ్చేశారు.” అని మోదీ తెలిపారు.

జీఎస్టీ రేట్లను తగ్గించే నిర్ణయాన్ని తమ ప్రభుత్వం సాధించిన చారిత్రక విజయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ ఇటీవల కాలంలో జీఎస్టీ తదుపరి తరం సంస్కరణలను కూడా ప్రారంభించిందని తెలిపారు. దసరా నవరాత్రుల మొదటి రోజున తగ్గిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయని గుర్తు చేసుకున్నారు. 

ఈ ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ (పొదుపు పండుగ) సందర్భంగా దేశ ప్రజలు వేలాది కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నారని వెల్లడించారు. బహుళ సంక్షోభాలతో ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే భారత్ స్థిరత్వానికి చిహ్నంగా మారిందన్నారు. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వికసిత్ (అభివృద్ధి చెందిన), ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంభన భారతదేశం) కోసం పాటుపడాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అలాగే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. అన్ని భాషలను గౌరవించడం, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, యోగాను స్వీకరించడం, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం వంటి ప్రయత్నాలు దేశాన్ని త్వరగా వికసిత్ భారత్ వైపునకు తీసుకెళ్తాయని భరోసా వ్యక్తం చేశారు.