
* బీజేపీ-మజ్లిస్ మధ్యే ప్రధాన పోటీ
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం బిజెపి అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఉదయం వెంకటగిరి హైలంకాలనీలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాoచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం, హైలంకాలనీ నుంచి నామినేషన్ ర్యాలీకి ఘనంగా ఆరంభమైంది. డప్పు నృత్యాలతో ఈ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపక్ రెడ్డికు మద్దతు ప్రకటించారు. నామినేషన్ దాఖలు అనంతరం మీడియాతో మాట్లాడిన రాoచందర్ రావు “జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధికి ఓటు వేయబోతున్నారు. దీపక్ రెడ్డి విజయం తథ్యం’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ-మజ్లిస్ మధ్యే ప్రధాన పోటీ జరుగుతోందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, వారు పోటీలో ఉన్నట్టు నటించడమే తప్ప, వాస్తవానికి ప్రజలు ఇప్పటికే బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారని ఆయన తెలిపారు. నగరంలోని కాలనీల్లో డ్రైనేజ్ వాసనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ప్రతి రోజు మురుగు నీటి సమస్యలతో బాధపడుతున్నా, ప్రభుత్వం స్పందించకుండా విఫలమైందని ధ్వజమెత్తారు.
ధనికులు నివసించే మంచి కాలనీల పరిస్థితి ఇదైతే, సామాన్య ప్రజల స్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించుకోవచ్చని చెప్పారు. ప్రజలు కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెబుతూ వాగ్దానాలు చేసి పనులు చేయకపోవడమే పాలనగా మారిపోయిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు గతంలో ఏ ప్రభుత్వమూ అభివృద్ధి, పథకాల అమలులో సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, ముఖ్యంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తప్ప మిగతా పార్టీలు ప్రజలపై మాయాజాలం, అబద్ధాల ప్రచారం, తప్పుడు హామీలతోనే పోటీ పడుతున్నాయని దుయ్యబట్టారు. నిజమైన అభివృద్ధి, ప్రజల నమ్మకానికి, పారదర్శక పాలనకు బీజేపీయే ప్రత్యామ్నాయం అని రామచందర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పురోగతి, శాంతి స్థిరత్వం కోసం బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు
మొత్తం మీద 150కి పైగా అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు, ఓయూ విద్యార్థి సంఘాల నేతలు, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) బాధిత రైతులు, అలాగే నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు.
More Stories
తెలంగాణాలో ముస్లిం అరాచక శక్తులు విశృంఖల విహారం
దీపావళి రోజున రేవంత్ ఇంటికి కొండా దంపతులు
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ కాల్చివేత