దేశ‌వ్యాప్తంగా అంబ‌రాన్నంటిన దీపావ‌ళి వేడుక‌లు

దేశ‌వ్యాప్తంగా అంబ‌రాన్నంటిన దీపావ‌ళి వేడుక‌లు
దేశ‌వ్యాప్తంగా దీపావ‌ళి వేడుక‌లు అంబ‌రాన్నంటాయి.  దీపాల పండుగ అయిన దీపావళిని జరుపుకోవడానికి దేశం మొత్తం ఒకచోట చేరడంతో ఈ వారం భారతదేశం అంతటా లక్షలాది ఇళ్లు, వీధులు వెలిగిపోయాయి. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పండుగలలో ఒకటైన దీపావళి మతం, ప్రాంతాలను దాటి, కుటుంబాలు, సంఘాలు, సంస్కృతులను ఒకచోట చేర్చి, కాంతి, ఆనందం, ఐక్యతల ఉత్సాహభరితమైన వేడుకను జరుపుకుంది. 
 
ఈ సంవత్సరం దీపావళి సంప్రదాయం, ఆధునిక సర్దుబాట్ల మిశ్రమాన్ని చూసింది. ఒక ముఖ్యమైన చర్యలో, సుప్రీంకోర్టు 2020 తర్వాత మొదటిసారిగా ఢిల్లీలో “గ్రీన్ క్రాకర్స్” వాడకాన్ని అనుమతించింది, వాయు కాలుష్యాన్ని అరికట్టే లక్ష్యంతో నిషేధాన్ని సడలించింది. పర్యావరణ ఆందోళనలు ఎక్కువగా ఉన్నప్పటికీ, పర్యావరణ అనుకూల ఎంపికలతో జరుపుకునే అనేక మంది ఆనందోత్సాహికులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించింది.
దీపావళి సంద‌ర్భంగా లక్ష్మీదేవికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఇండ్లు, దుకాణ స‌ముదాయాల్లో విశేషంగా ల‌క్ష్మీపూజ‌లు జ‌రిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు ముంబ‌యి, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా యావ‌త్ దేశ‌వ్యాప్తంగా వివిధ న‌గ‌రాల్లో బాణాసంచాల మోత‌మోగింది. దీపావ‌ళి సంద‌ర్భంగా గ‌త రెండుమూడు రోజులుగా బాణాసంచా దుకాణాలు కిట‌కిట‌లాడాయి. 
 
బాణాసంచా ధ‌ర‌లు భారీ ధ‌ర ప‌లుకుతున్నా పెద్ద సంఖ్య‌లో కొనుగోలు చేశారు. దేశ‌వ్యాప్తంగా పెద్దాచిన్న తేడా లేకుండా వీధుల్లోకి వ‌చ్చి బాణాసంచా కాలుస్తూ దీపావ‌ళి వేడుక‌ల‌ను అంబ‌రాన్నంటేలా నిర్వ‌హించారు. దేశ ప్ర‌జ‌ల‌కు భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా ప‌లువురు నేత‌లు ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. పలు ప్రాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. 
 
వీధుల్లో టపాసులు కాల్చుతూ, మతాబులు వెలిగిస్తూ చిన్నారులు, పెద్దలు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక ఇళ్లను దీపాలతో అలంకరణ చేశారు. చారిత్రక భవనాలు ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. వ్యాపార భవనాలు విద్యుత్ కాంతులతో మెరుస్తున్నాయి. అనేకమంది ప్రముఖులు తమ ఇళ్ళ ముందు దీపావళి సంబరాలను జరుపుకుంటున్నారు. అటు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అనేక భవనాలకు విద్యుత్​ దీపాలంకారణతో అలకరించారు. 
 
ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల నరకాసురుడి దహన కార్యక్రమాలను నిర్వహించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనికులు గ్రామస్థులు, పిల్లలతో కలిసి దీపావళి జరుపుకొన్నారు. తమిళనాడులో ఉదయం నుంచే పిల్లలు బాణాసంచా కాలుస్తున్నారు.
 
మరోవైపు దీపావళి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేసి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 
 
అంతకుముందు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబ సభ్యులు, డిల్లీ సీఎం రేఖా గుప్తా రాష్ట్రపతిని కలిసి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం రాష్ట్రపతి షేర్‌ చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మానసాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీపావళి సందర్భంగా కేదార్‌నాథ్‌ ఆలయాన్ని 12 క్వింటాళ్ల పూలతో అందంగా అలంకరించారు. 
ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి స్థానికులకు పండ్లు అందజేశారు. వారితోనే దీపావళి వేడుకలు జరుపుకొన్నారు.  మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్‌ ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు చేశారు. దిల్లీలో వీహెచ్‌పీ నాయకులు పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. 
తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయానికి భక్తులు బారులు తీరారు. దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. తిరుచిరాపల్లి, మధురైలో ఉదయం నుంచే టపాసులు కాలుస్తున్నారు.  కర్ణాటకలోని చిక్కమగళూరు తాలుకా మల్లేనహళ్లిలో ఏడాదికి రెండు రోజులే దర్శనమిచ్చే అమ్మవారిని చూడటానికి భక్తులు పోటెత్తారు. ఏడాది తర్వాత ఈ ఆలయం తలుపులు తెరుచుకోవడంతో ఉదయం నుంచే భక్తుల రాక మెుదలైంది.