
కేంద్రంతో చర్చలను తిరిగి ప్రారంభించేందుకు లడఖ్‌లోని రెండు ఉద్యమ గ్రూప్‌లైన లెహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఎబి), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (కెడిఎ)లు అంగీకరించాయి. అక్టోబర్ 22న (బుధవారం) న్యూఢిల్లీలో హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ)తో చర్చలను తిరిగి ప్రారంభించనున్నట్లు ఆదివారం ప్రకటించాయి. సెప్టెంబర్ 24, 26 తేదీల్లో భద్రతాదళాల కాల్పుల్లో నలుగురు పౌరులు మరణించడం, కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్ నేపథ్యంలో, అక్టోబర్ 6న జరగాల్సిన చర్చల నుండి ఎల్‌ఎబి, కెడిఎలు వైదొలిగాయి.
అధికారిక వర్గాల ప్రకారం చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఎంహెచ్‌ఎ అధికారులు ఆదివారం లడఖ్ గ్రూప్‌లను సంపద్రించాయి. ఉప కమిటీతో చర్చలు జరపనున్న ప్రతినిధి బృందానికి ఎల్‌ఎబి చైర్మన్ తుప్సాన్ చెవాంగ్, కెడిఎకి చెందిన ఖమర్ అలీ అఖూన్, అస్గర్ అలీ, సజ్జాద్ కార్గిలి, లడఖ్ పార్లమెంట్ సభ్యులు హాజి హనీఫా నేతృత్వం వహించనున్నారు.
”ఎంహెచ్‌ఎ చొరవను స్వాగతిస్తున్నాం. అక్టోబర్ 22న న్యూఢిల్లీలో జరిగే ఉప కమిటీ చర్చల గురించి అధికారులు సమాచారం అందించారు. ఎల్‌ఎబి, కెడిఎలు చర్చల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి. సానుకూల వాతావరణంలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాము” అని లడఖ్ బౌద్ధ సంఘం (ఎల్‌బిఎ) అధ్యక్షుడు, ఎల్‌ఎబి ఉపాధ్యక్షుడు చెరింగ్ డోర్జరు లక్రుక్ తెలిపారు.
రాష్ట్ర హోదా, ఆరవషెడ్యూల్ ముఖ్య డిమాండ్లపై ఎల్‌ఎబి, కెడిఎలు దృష్టిసారిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం డిమాండ్లపై నిజాయితీగా చర్చలు జరుపుతుందని ఆశిస్తున్నామని లక్రుక్ తెలిపారు. “లడఖ్ డిమాండ్లు సహా సెప్టెంబర్ 24న బాధితులకు న్యాయం జరగాలని, వాంగ్‌చుక్ సహా అక్రమంగా నిర్బంధించిన ఖైదీలను విడుదల చేయాలని కోరుతున్నాము. నిజమైన సంభాషణ మాత్రమే విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని, లడఖ్ ఆకాంక్షలను నెరవేర్చగలదని మేము విశ్వసిస్తున్నాము” అని కార్గిలి చెప్పారు.
More Stories
సరిహద్దుల్లో 120 మంది సాయుధ ఉగ్రవాదులు!
బ్రహ్మోస్ క్షీపనుల పరిధి ఇప్పుడు రెట్టింపు దూరం
పౌరుల సత్ప్రవర్తనతో అగ్రగామిగా కేరళ, తమిళనాడు, బెంగాల్