
జీఎస్టీ సంస్కరణలు భారత్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని, తద్వారా ఆశించిన ప్రయోజనాలను వినియోగదారులకు చేరుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొనుగోళ్లు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. శనివారం డిల్లీలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూశ్ గోయల్‌తో సంయుక్తంగా నిర్వహంచిన మీడియా సమావేశంలో నవరాత్రి వేడుకల తొలిరోజు జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపు అమల్లోకి వచ్చినట్లు గుర్తు చేశారు.
ఈ నిర్ణయాన్నిప్రజలు స్వాగతిస్తున్నట్లు ఆమె చెప్పారు. ‘జీఎస్టీ సంస్కరణల ఫలితంగా కొనుగోళ్లు పెరిగాయి. ప్రతి ఉత్పత్తి విషయంలో వినియోగదారులకు ప్రయోజనాలు అందిస్తున్నాయని మేం విశ్వసిస్తున్నాం. కొన్ని వస్తువుల విషయంలో వ్యాపార సంస్థలు జీఎస్టీ రేటు తగ్గింపుతో వచ్చిన లాభాలను అంతకంటే ఎక్కువ మొత్తంలో వినియోగదారులకు అందించాయ’ అని ఆమె తెలిపారు.
`జీఎస్టీ తగ్గింపునకు అనుగుణంగా ధరలు తగ్గించకపోవడంపై వినియోగదారుల వ్యవహారాల శాఖకు 3,169 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 3,075 ఫిర్యాదులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసి)లోని నోడల్ అధికారులకు పంపించారు. మొత్తం 94 ఫిర్యాదులను ఆ శాఖ పరిష్కరించింది’ అని ఆమె చెప్పారు. వినియోగదారుల ఫిర్యాదులను మరింత వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నామని, దీని ద్వారా ఫిర్యాదులు ఆయా ప్రాంతాల చీఫ్ కమిషనర్లకు నేరుగా చేరతాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
జీఎస్టీ సంస్కరణల ఫలితంగా ఈ ఏడాది రూ.20 లక్షల కోట్లు అదనంగా ఎలక్ట్రానిక్స్ వినియోగం జరగనుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘అమెరికాకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో భారత్ పొరుగు దేశాలను అధిగమించింది. ఇది దేశానికి పెద్ద విజయం. రిటైల్ చైన్ డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం నవరాత్రి సమయంలో అమ్మకాలు గత సంవత్సరం కంటే 20-25 శాతం పెరిగాయి’ అని చెప్పారు.
More Stories
చిత్తాపూర్లో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ అనుమతి రద్దు
చంద్రుడిపై వాతావరణంపై సూర్యుడి ప్రభావం!
బీహార్ లో విపక్ష ఇండియా కూటమిలో చీలికలు