సత్యసాయి పోలీసుల అదుపులో మరి ఇద్దరు ఐఎస్ఐ ఉగ్రవాదులు

సత్యసాయి పోలీసుల అదుపులో మరి ఇద్దరు ఐఎస్ఐ ఉగ్రవాదులు
 

ధర్మవరంలో పట్టుబడిన ఉగ్రవాద సానుభూతిపరుడు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరు ఉగ్రవాదులను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరంలోని ఓ హోటల్​లో బిర్యానీ మాస్టర్​గా పనిచేస్తూ, యువతను ఉగ్రవాదంపై మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని కొత్వాల్ నూర్ మహమ్మద్​ను ఆగస్టు 16న ఆదుపులోకి తీసుకున్నారు. 

జ్యుడీషియల్ కస్టడీ నుంచి నూర్ మహమ్మద్​ను పోలీసు కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులకు ఉగ్రమూలాలపై మరింత సమాచారం వచ్చింది. దీనిపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఎన్​ఐఏ సహకారంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇద్దరు వ్యక్తులపై నిఘా పెట్టారు.  పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధారిత జైష్-ఎ-మహమ్మద్ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉంటూ యువతను ఉగ్రవాదంవైపు ప్రేరేపితం చేస్తున్నట్లుగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. 

మహారాష్ట్రలో తౌఫిక్ ఆలం షేక్, ఉత్తరప్రదేశ్ వాసి సాజాద్ హుస్సేన్​లను శ్రీ సత్యసాయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ ఆయా రాష్ట్రాల్లో స్థానిక న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ పై పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను పుట్టపర్తికి తీసుకొచ్చారు. నిందితుల నుంచి మొబైల్స్‌, గన్స్‌, మందగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులకు సంబంధించిన వివరాలను శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వివరించారు.

“నూర్ మహమ్మద్​తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థాన్ ఐఎస్ఐ ఆధారిత జైష్-ఎ-మహమ్మద్​తో టచ్​లో ఉన్నట్టు మనకు సమాచారం వచ్చింది. దీంతో మహారాష్ట్రలో తౌఫిక్ ఆలం షేక్, ఉత్తరప్రదేశ్ వాసి సాజాద్ హుస్సేన్​లను నిందితుల జాబితాలో చేర్చి అదుపులోకి తీసుకున్నాం. సాజాద్ హుస్సేన్ దగ్గర ఉన్న గన్నును సీజ్ చేశాం. ఈ గన్​ను జీహద్ కోసం వాడినట్టు తెలిసింది” అని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. 

“హుస్సేన్ పాకిస్థాన్​లో ఉన్న టెర్రరిస్ట్ సంస్థలతో పాటు వీడియో కాల్​లో మాట్లాడినట్టు మనకు ఆధారాలు దొరికాయి. ఇక్కడి యువతను ట్రాప్​ చేసేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ఐఎస్ఐ ఆధారిత ప్రేరేపిత సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి యువత చాలా జాగ్రత్తగా ఉండాలి” అని హెచ్చరించారు.  కొద్దిరోజుల క్రితమే రాష్ట్రంలో మరోసారి ఉగ్ర కదలికలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలతో ఫోన్​లో చాటింగ్ చేస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్​ అనే యువకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  నూర్ మహమ్మద్​ పాకిస్థాన్​లోని ఉగ్రవాద సంస్థలతో నిత్యం టచ్‌లో ఉండటమే కాకుండా సుమారు 30 వరకు తీవ్రవాద గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఏయే విషయాలపై అతడు చాటింగ్ చేశాడనే విషయాలను పోలీసులు విచారణ జరిపారు.

 నూర్ మహమ్మద్ ధర్మవరం మార్కెట్ సమీపంలోని ఓ బిర్యానీ సెంటర్​లో టీ మాస్టర్​గా పని చేసేవాడు. ఇతను పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థల ప్రభావానికి లోనైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు పాకిస్థాన్​లోని ఉగ్రవాద సంస్థలతో నిత్యం వాట్సాప్ చాటింగ్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.