గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. 26 మంది సభ్యులతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం వారంతా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని లక్షకు పైగా ఓట్లతో ఓడించి ఘన విజయం సాధించారు.
కొత్త మంత్రివర్గంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు కూడా చోటు దక్కింది. ఆమె కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బిజెపి అధ్యక్షులు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గత క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల్లో కేవలం నలుగురికి మాత్రమే తిరిగి పదవులు చేపట్టారు. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా తన కూతురుతో కలిసి హాజరయ్యారు.
1990లో రాజ్‌కోట్‌లో జన్మించిన రివాబా. ఆత్మియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2016 ఏప్రిల్ 17న రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. 2019లో బిజెపిలో చేరారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. బిజెపిలో చేరడానికి ముందు 2018లో కర్ణిసేన మహిళ విభాగానికి చీఫ్‌గా వ్యవహరించారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మంత్రులంతా గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వారి రాజీనామాలను ఆమోదించారు. అనంతరం సీఎం భూపేంద్ర పటేల్ గురువారం రాత్రి గవర్నర్‌ను కలిసి మంత్రుల రాజీనామాలను అధికారికంగా గవర్నర్‌కు సమర్పించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుల, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడం, ప్రభుత్వంలో కొత్త శక్తిని నింపేందుకు బీజేపీ విస్తృత వ్యూహంలో భాగంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
More Stories
బీహార్ లో ఎన్నికల తర్వాతే ఎన్డీయే సీఎం అభ్యర్థి
ఆశన్నతో పాటు 170 మంది మావోయిస్టులు లొంగుబాటు
స్మృతి మంధాన, అభిషేక్ శర్మలకు ఐసీసీ అవార్డు