పంజాబ్ డీఐజీని ప‌ట్టించిన వాట్సాప్ కాల్ రికార్డింగ్‌

పంజాబ్ డీఐజీని ప‌ట్టించిన వాట్సాప్ కాల్ రికార్డింగ్‌
అవినీతి ఆరోపణలపై సిబిఐ అరెస్ట్ చేసిన పంజాబ్‌ డీఐజీ హ‌ర్‌చ‌ర‌ణ్ సింగ్ బుల్లార్‌ లంచం తీసుకోవాల‌ని మ‌ధ్య‌వ‌ర్తితో బుల్లార్ మాట్లాడిన వాట్సాప్ కాల్ రికార్డింగ్‌ను సాక్ష్యంగా చూపారు. మండి గోబింద్‌ఘ‌ర్‌కు చెందిన స్క్రాప్ డీల‌ర్ న‌రేశ్ బ‌ట్ట ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. 2023 నాటి క్రిమిన‌ల్ కేసును సెటిల్ చేసేందుకు 8 ల‌క్ష‌ల అమౌంట్‌ను డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌ధ్య‌వ‌ర్తి కిర్ష‌ను కూడా అరెస్టు చేశారు. 
 
షిర్‌హింద్ పోలీసు స్టేష‌న్‌లో న‌మోదు అయిన ఫిర్యాదు కేసులో డీఐజీ బ‌ల్లార్ పేమెంట్ డిమాండ్ చేశారు. బుల్లార్‌పై న‌మోదు అయిన ఎఫ్ఐఆర్‌ ప్రకారం డీఐజీ ప‌దేప‌దే లంచం డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌తి నెలా పేమెంట్స్ ఇవ్వాల‌ని వేధించారు. సేవా పానీ పేరుతో ఆ వ‌సూళ్ల‌కు పాల్ప‌డేవారని తెలుస్తోంది.  ఒక‌వేళ నెల‌నెలా వ‌సూళ్లు ఇవ్వ‌కుంటే, బిజినెస్ సంబంధిత నేరాల్లో ఇరికిస్తామ‌ని హెచ్చ‌రించేవాడు.
నెల‌వారి వ‌సూళ్ల‌తో పాటు బుల్లార్ అద‌నంగా రూ. 28 ల‌క్ష‌లు డిమాండ్ చేసిన‌ట్లు స్క్రాప్ డీల‌ర్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు.మ‌ధ్య‌వ‌ర్తి కిర్ష‌నుతో బుల్లార్ మాట్లాడిన కాల్ అత‌ని అరెస్టులో కీల‌కంగా మారింది.  అక్టోబ‌ర్ 11వ తేదీన ఇద్ద‌రి మ‌ధ్య వాట్సాప్ ద్వారా సంభాష‌ణ జ‌రిగింది. అయితే లంచం వ‌సూల్ చేయాల‌ని చెప్పి మ‌ధ్య‌వ‌ర్తి కిర్ష‌నుకు ఆ ఫోన్ కాల్ ద్వారా డీఐజీ ఆదేశించిన‌ట్లు తేలింది. `రూ. 8 ల‌క్ష‌లు తీసుకో.. లేదా అత‌ను ఎంత ఇస్తే అంత తీసుకో, కానీ చివ‌ర‌కు రూ. 8 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే అని చెప్పు’ అని డీఐజీ త‌న సంభాష‌ణ‌లో పేర్కొన్నారు.

బుల్లార్ ఇంటి నుంచి రూ. 5 కోట్ల న‌గ‌దు, 1.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు గంట‌ల పాటు క్యాష్ కౌంటింగ్ మెషీన్‌తో నోట్ల క‌ట్ట‌ల‌ను లెక్కించారు. బుల్లార్ ద‌గ్గ‌ర నుంచి బీఎండ‌బ్ల్యూ, ఆడి కార్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 22 ల‌గ్జ‌రీ వాచీలు, 40 లీట‌ర్ల విదేశీ మ‌ద్యం, ప‌లు ర‌కాల ఆయుధాలు, డ‌బుల్ బారెల్ గ‌న్‌, పిస్తోల్‌, రివాల్వ‌ర్‌, ఎయిర్‌గ‌న్ ఉన్నాయి.