అక్రమాస్తుల కేసులో పంజాబ్ డిఐజి అరెస్టు

అక్రమాస్తుల కేసులో పంజాబ్ డిఐజి అరెస్టు

పంజాబ్ పోలీసు శాఖ‌లో రోపర్ రేంజ్‌కు డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా ప‌నిచేస్తున్న హ‌ర్‌చ‌ర‌ణ్ సింగ్ బుల్లార్‌ను గురువారం సీబీఐ అధికారులు అవినీతికి సంబంధించిన కేసులో అరెస్టు చేశారు. మొహాలీ ఆఫీసు నుంచి ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. అవినీతి కేసులో హ‌ర్‌చ‌ర‌ణ్ సింగ్ బుల్లార్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. 

ఇదే కేసులో మ‌రో ప్రైవేటు వ్య‌క్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హ‌ర్‌చ‌ర‌ణ్ బుల్లార్ ఆఫీసుతో పాటు ఇళ్లు, ఇత‌ర ప్ర‌దేశాల్లోనూ సోదాలు జ‌రిగాయి. రోప‌ర్ రేంజ్ డీఐజీ బుల్లార్‌ను పంచ‌కుల‌కు తీసుకెళ్లారు. ఆ త‌ర్వాత ఆయ‌న్ను మ‌ళ్లీ వెన‌క్కి తీసుకువ‌చ్చారు. ఫ‌తేఘ‌ర్‌కు చెందిన ఓ స్క్రాప్ డీల‌ర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చండీఘ‌డ్‌లోని సీబీఐ అధికారులు డీఐజీని అరెస్టు చేశారు.

2023లో మండి గోబింద్‌గఢ్‌కు చెందిన తుక్కువ్యాపారి ఆకాశ్‌ భట్టాపై కేసు నమోదయింది. ఈ కేసు మాఫీ చేసేందుకు నెలవారీ మామూళ్లతోపాటు రూ.8 లక్షల లంచం ఇవ్వాలని డీఐజీ హర్‌చరణ్‌ డిమాండ్‌ చేశారు. మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ అనే వ్యక్తి ఇరువురి మధ్య డీల్‌ ఓకే చేశారు. అయితే ఆకాశ్‌ సీబీఐని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు డీఐజీపై నిఘాపెట్టారు. ఈ క్రమంలో చండీగఢ్‌లో ఆకాశ్‌ నుంచి డీఐజీ తరపున రూ.8 లక్షలు తీసుకుంటుండగా కిషన్‌ను అధికారులు గురువారం పట్టుకున్నారు.

2024, న‌వంబ‌ర్ 27వ తేదీన రోప‌ర్ రేంజ్ డీఐజీగా బుల్లార్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. దానికి ముందు ఆయ‌న పాటియాలా రేంజ్ డీఐజీగా చేశారు. డ్ర‌గ్స్‌కు వ్య‌తిరేకంగా సాగిన‌ యుద్ద్ న‌షేయాన్ విరుద్ కార్య‌క్ర‌మంలో చురుకుగా ఆయ‌న పాల్గొన్నారు.  పంజాబ్ మాజీ డీజీపీ మెహ‌ల్ సింగ్ బుల్లార్ కుమారుడే హ‌ర్‌చ‌ర‌న్ సింగ్ బుల్లార్‌. డ్ర‌గ్ స్మ‌గ్లింగ్ కేసులో అకాళీ నేత బిక్రం సింగ్ మంజితాను విచారించిన బృందానికి సిట్ అధిప‌తిగా చేశారు.

ఈ సందర్భంగా పంజాబ్‌, చండీగఢ్‌లో ఆయనకు సంబంధించిన ఇండ్లల్లో అధికారులు తనిఖీలు చేశారు. దీంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకివచ్చాయి. డీఐజీ కార్యాలయంతోపాటు రోపార్‌, మొహాలి, చండిగఢ్‌లోని భల్లార్‌ నివాసాల్లో తనిఖీలు జరుపగా సుమారు రూ.5 కోట్ల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, స్థిరాస్తి పత్రాలు, మెర్సెడెస్‌, ఆడీ కార్ల తాళాలు, 22 లగ్జరీ గడియారాలు, లాకర్ తాళాలు, 40 లీటర్ల దిగుమతి చేసిన మద్యం, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్‌గన్‌తో సహా తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.