ఎన్డీఏ విజయంతో బిహార్ లో మరో దీపావళి

ఎన్డీఏ విజయంతో బిహార్ లో మరో దీపావళి

నవంబర్ 14న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పుడు ఎన్డీఏ విజయాన్ని సాధిస్తుందని, దీని ద్వారా బిహార్ మరో దిపావళిని జరుపుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మన పార్టీ విజయం సాధించడంలో మహిళలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు.  బిహార్ మహిళా బూత్ కార్యకర్తలను ఉద్దేశించి  నమో యాప్ ద్వారా బిహార్ బీజేపీ కార్యకర్తలతో వర్చువల్గా మాట్లాడిన ప్రధాని మోదీ, మహిళలు బయటకు వచ్చి ఓటు వేయాలని, పాటలు, పాడుతూ, తాళాలు కొడుతూ అందరినీ ప్రోత్సహించాలని కోరారు.

“ఈసారి బిహార్లో డబులు దీపావళి జరుపుకోనుంది. మొదట జీఎస్టీ సంస్కరణల కారణంగా ప్రజలు నవరాత్రి మొదటి రోజున దీపావళి జరుపుకున్నారు. ఇప్పుడు అక్టోబర్ 20న కూడా జరుపుకుంటారు. కానీ ఈసారి నవంబర్ 14న ఎన్డీఏ విజయాన్ని దీపావళిగా జరుపుకునే మూడ్లో బిహార్ ఉంది. బిహార్ సోదరీమణులు, కుమార్తెలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు” అని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.

“అక్టోబర్ 23న భాయ్ దూజ్ రోజున బిహార్లోని బీజేపీ బూత్ లెవల్ కార్యకర్తలు అందరూ తమ బూత్ల్లో సోదరీమణుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. వారి వారి ప్రాంతాల్లో ‘లఖ్పతి దీదీ’, ‘డ్రోన్ దీదీ’లను గౌరవించాలి” అని మోదీ కోరారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రం, నితీశ్ కుమార్ ప్రభుత్వాలు ప్రారంభించిన పథకాల గురించి ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా “ఎన్డీఏ కూటమి, బిహార్ రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా ఉంటే, సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పడుతుంది” అని ప్రధాని మోదీ ఓ నినాదాన్ని ఇచ్చారు. పార్టీ విజయాన్ని నిర్ధరించడానికి ప్రతి బూత్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాల గురించి ప్రతి కుటుంబానికి తెలియజేయాలని బూత్ లెవల్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

“ప్రతి బూత్ బలంగా ఉన్నప్పుడే పార్టీ గెలుస్తుంది. వాస్తవానికి ప్రతి బూత్ లెవల్ బీజేపీ కార్యకర్త ఒక మోదీయే. అందుకే ప్రభుత్వ పథకాల గురించి నా తరఫున ప్రజలకు హామీ ఇవ్వండి. మీ ప్రాంతంలోని వారందరికీ వివిధ ప్రభుత్వ పథకాల గురించిన వీడియోలను షేర్ చేయండి” అని మోదీ తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

మోదీ ఒకప్పటి ఆర్జేడీ పాలనను ప్రస్తావిస్తూ “బిహార్లో ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండేది. ఆ జంగిల్ రాజ్ కాలంలో రాష్ట్రంలో ఏం జరిగిందో నేటి యువతకు తెలియదు. కనుక ఆనాటి పరిస్థితులపై యువతకు అవగాహన కల్పించాలి. లేకుంటే మావోయిజాన్ని తిరిగి పుంజుకునేలా చేసే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్ల దుష్ట దృష్టి నుంచి రాష్ట్రాన్ని కాపాడే శక్తి బిహార్ ప్రజలకు మాత్రమే ఉంది.” అని మోదీ హెచ్చరించారు.