
దీపావళి పండుగ సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ నగరం భారతీయ సాంస్కృతిక శోభతో వెలిగిపోయింది. నగరంలోని చారిత్రక ట్రాఫాల్గర్ స్క్వేర్‌లో అక్టోబర్ 12న నిర్వహించిన ‘దివాలీ ఆన్ ది స్క్వేర్ 2025’ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని దీపావళి స్ఫూర్తిని చాటారు.
ఈ వేడుకలు 200 మంది కళాకారులు ప్రదర్శించిన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ప్రారంభమయ్యాయి. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో వారు చేసిన శాస్త్రీయ, జానపద, బాలీవుడ్ నృత్యాలు అక్కడి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అనంతరం హిందూ, సిక్కు, జైన్ కమ్యూనిటీలకు చెందిన కళాకారులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
దీపావళి పండుగలోని భాగస్వామ్య విలువలను, గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలను ఈ ప్రదర్శనలు ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్శకుల కోసం ప్రత్యేకంగా చీర కట్టడం, తలపాగా చుట్టడం, యోగా, పిల్లల కోసం తోలుబొమ్మలాటలు వంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలను ఏర్పాటు చేశారు. ‘ఎ గ్లింప్స్ ఆఫ్ గాడెసెస్’ పేరుతో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రాంగణంలోని ఫుడ్ స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన శాకాహార, వీగన్ వంటకాలను ప్రజలు ఆస్వాదించారు.
ఈ వేడుకల గురించి యూట్యూబర్ నయీమ్ కౌసర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, “లండన్‌లో జరిగే అత్యంత ఉత్సాహభరితమైన పండుగల్లో ఇది ఒకటి. భారత సంప్రదాయం, బ్రిటిష్ వేడుకల అద్భుతమైన కలయిక ఇక్కడ కనిపిస్తుంది” అని పేర్కొన్నారు. లండన్ మేయర్ కార్యాలయం, దివాలీ ఇన్ లండన్ కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఈ వేడుకల్లో పాల్గొని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి స్ఫూర్తిని పంచుకోవడానికి ట్రాఫాల్గర్ స్క్వేర్‌కు వచ్చిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. లండన్‌లోని హిందూ, సిక్కు, జైన్ కమ్యూనిటీలకు దీపావళి శుభాకాంక్షలు” అని ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
More Stories
ఐరాస మానవ హక్కుల మండలికి ఏడోసారి ఎన్నిక
మళ్లీ భగ్గుమన్న పాక్-అఫ్ఘాన్ సరిహద్దు.. కాల్పుల విరమణ
రహస్య పత్రాల లీక్‌లో భారత సంతతి రక్షణ వ్యూహకర్త అరెస్ట్