
భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌కు చెందిన 100 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైన్యంలోని డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డిజిఎంఒ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. పాకిస్థాన్ ఆగస్టు 14న ప్రకటించిన వీరమరణ సైనికుల జాబితాలో ఉన్న సంఖ్యను బట్టి ఈ అంచనాలు వెల్లడి అయ్యాయని చెప్పారు. అదే సమయంలో పాకిస్థాన్ వాయుసేనకు చెందిన 12 యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయని ఆయనతెలిపారు.
మే 7న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత భూభాగంలో ఉన్న తొమ్మిది ఉగ్రశిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం కచ్చితమైన దాడులు జరిపింది. దీని అనంతరం పాకిస్థాన్ తక్షణమే సరిహద్దు కాల్పులు ప్రారంభించిందని రాజీవ్ ఘాయ్ తెలిపారు. మే 7 నుంచి 10 వరకు రెండు దేశాల మధ్య తీవ్ర సైనిక ఘర్షణలు జరిగాయని, చివరికి మే 10న కాల్పులు నిలిపివేయాలన్న అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు.
ఆ సమయంలో పాక్ నావికాదళం, వైమానిక దళం పూర్తి సన్నద్ధతలో ఉన్నప్పటికీ, భారత సైన్యం చేసిన ప్రతిఘటనకు అది తట్టుకోలేకపోయిందని గుర్తు చేశారు. పాకిస్థాన్ డ్రోన్లను ఉపయోగించి భారత సరిహద్దు ప్రాంతాల్లో నష్టం కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ, అవి పూర్తిగా విఫలమయ్యాయని లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ చెప్పారు. “వారు వివిధ రకాల డ్రోన్లను పంపినా, ఒక్కదీ తమ లక్ష్యాన్ని చేరుకోలేదు. అన్నీ వృధా అయ్యాయి” అని ఆయన స్పష్టం చేశారు. డ్రోన్ దాడులకు ప్రతిగా భారత వైమానిక దళం మే 9-10 రాత్రి పాక్ సైనిక స్థావరాలపై తీవ్ర వైమానిక దాడులు జరిపిందని రాజీవ్ ఘాయ్ తెలిపారు.
“మేం వారి 11 ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నాం. వాటిలో ఎనిమిది ఎయిర్‌బేస్‌లు, మూడు హ్యాంగర్లు, నాలుగు రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి” అని చెప్పారు. పాకిస్థాన్ ఒక సి-130 రకానికి చెందిన విమానం, ఒక ఎఈడబ్ల్యు&సి (ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్) విమానం, నాలుగు నుంచి ఐదు యుద్ధ విమానాలను కోల్పోయిందని వివరించారు.
అలాగే 300 కిలోమీటర్ల దూరం నుంచి భూస్థాయి క్షిపణులతో ఐదు ఫైటర్ జెట్లు కూల్చివేయడం ప్రపంచంలోనే అతి పొడవైన ఎయిర్ కిల్‌గా నమోదైందని చెప్పారు. కాగా, పహల్గాం దాడికి బాధ్యులైన ముగ్గురు ఉగ్రవాదులను జూన్‌లో భారత సైన్యం హతమార్చిందని రాజీవ్ ఘాయ్ తెలిపారు. “వారిని 96 రోజులపాటు వెంబడించాం. చివరకు వారిని నరకం వరకు వెంబడించి అంతం చేశాం” అని ఆయన స్పష్టం చేశారు.
ఉగ్రవాదంపై భారత్ వైఖరిలో మౌలిక మార్పు చోటుచేసుకుందని లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ తెలిపారు. “ఉగ్రదాడులు యుద్ధ చర్యలుగా పరిగణిస్తున్నాం. కాబట్టి నిర్ణయాత్మక ప్రతిస్పందన తప్పదు. అణు బెదిరింపులకు తలవంచం. ఉగ్రవాదులు, వారిని ప్రోత్సహించే వారిలో ఎలాంటి తేడా ఉండదు” అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన అంశాలను ఆయన గుర్తుచేశారు. మొత్తం మీద, ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం చూపిన కచ్చితత్వం, ప్రణాళిక, ధైర్యం పాకిస్థాన్‌కు గట్టి పాఠం నేర్పిందని లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ వ్యాఖ్యానించారు.
More Stories
సీఎం ఫడణవీస్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మల్లోజుల
వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణంలో ప్రారంభ వికాసం
బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు మృతి