రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. రన్నింగ్ బస్సులో మంటలు భీకరమైన మంటలు చెలరేగాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మందికిపైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనం కాగా, మరికొందరు కిటికీలు పగులగొట్టి తప్పించుకున్నారు.
మంటలు చెలరేగడంతో బస్సు డోర్ లాక్ అయ్యాయని, దాంతో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు వీలు లేకుండాపోయిందని తెలుస్తున్నది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనలో 19 మంది గాయపడగా, వారిని జోధ్‌పూర్ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన వారిలో స్థానిక జర్నలిస్ట్ రాజేంద్ర సింగ్ చౌహాన్ సైతం ఉన్నారు. బస్సు జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్‌కు వెళ్తుండగా ఏసీ యూనిట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్ది సేపట్లోనే మంటలు బస్సంతా వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘోర ప్రమాదం తర్వాత రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ బిహార్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఘటన, సహాయక చర్యలపై ఆయన పర్యవేక్షించారు. జోధ్‌పూర్‌కు తీసుకువచ్చిన బాధితుల్లో ఎక్కువ మంది 70 శాతానికి పైగా కాలిన గాయాలతో మరణించారని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని సీఎం తెలిపారు. మృతుల్లో సైనికుడు మహేంద్ర, అతని, భార్య ఇద్దరు కూతుళ్లు సైతం ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. మహేంద్రను జైసల్మేర్‌లోని ఒక ఆయుధ డిపోలో పని చేస్తున్నారు.
బస్సు ప్రమాదంపై సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ స్పందిస్తూ జైసల్మేర్‌లో జరిగిన ప్రమాదం, ప్రాణనష్టం దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొంటూ ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి మరణించిన ప్రతి ఒక్కరి బంధువులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి రూ.50వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం విచారం వ్యక్తం చేస్తూ ఈ విషాద వార్త తనను కలచివేసిందని తెలిపారు.
బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికి తీశామని, డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతులను గుర్తించనున్నట్లు పోఖ్రాన్ ఎమ్మెల్యే మహంత్ ప్రతాప్ పూరి తెలిపారు. ప్రైవేటు బస్సు జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తుంది. జోధ్‌పూర్ హైవేలోని థైయత్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా బస్సులో పొగలు వచ్చాయి.
“20 కి.మీ దూరం వెళ్లన తరువాత, అకస్మాత్తుగా బస్సు వెనుక భాగం నుంచి పొగ రావడం ప్రారంభమైంది. తరువాత కొద్ది క్షణాల్లోనే వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. దీనితో అందులోని ప్రయాణికులు చాలా మంది కాలిపోయారు. అయితే మంటలు ఎలా వ్యాపించాయో ఇంకా తెలియరాలేదు” అని పోలీసులు తెలిపారు. డ్రైవర్, ప్రయాణికులు ఏమీ అర్థం చేసుకునేలోగానే మంటలు బస్సును చుట్టుముట్టాయి. కొందరు ప్రయాణికులు వెంటనే తేరుకొని అద్దాలను పగులగొట్టి బయపడ్డారు. మరికొందరు మంటలకు ఆహుతయ్యారు. ఇందులో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు.
More Stories
సీఎం ఫడణవీస్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మల్లోజుల
వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణంలో ప్రారంభ వికాసం
ఆపరేషన్ సిందూర్‌లో 100 మందికి పైగా పాక్ సైనికులు హతం