బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఎన్నికల ఆంక్షల ఉల్లంఘన కేసు 

బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఎన్నికల ఆంక్షల ఉల్లంఘన కేసు 
 
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు ఆమె  కుమార్తె మాగంటి అక్షరపై కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఫిర్యాదు చేసింది.
జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా మాగంటి సునీతను ఎ1గా, ఆమె కుమార్తె అక్షరను ఎ2గా నమోదు చేశారు.
వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు రాజ్‌కుమార్ పటేల్, అంజద్ అలీఖాన్, ఆజం అలీ, షఫీ, ఫయీం తదితరులపై కూడా కేసులు నమోదయ్యాయి. మతపరమైన ప్రదేశంలో రాజకీయ ప్రచారం నిర్వహించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై డిప్యూటీ తహసీల్దార్ ఫ్రాన్సిస్ నేతృత్వంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం విచారణ చేపట్టింది.
మసీదు వద్ద బీఆర్ఎస్ నాయకులు కండువాలు ధరించి చేతిలో కరపత్రాలతో కనిపించారని, ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా తేలిందని అధికారులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరోవంక, మాగంటి సునీతా గోపీనాథ్‌ కు పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫామ్ ను మంగళవారం అందజేశారు. అదేవిధంగా ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును కూడా అందించారు. ఈ సందర్భంగా మాగంటి సునీతా గోపినాథ్‌ వెంట ఆమె కూతుళ్లు, కుమారుడు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ఉన్నారు.