
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న కర్నూల్ పర్యటన సందర్భంగా ధ్యాహ్నం 2.30 గంటలకు కర్నూలులో రూ.13,430 కోట్ల విలువైన పలు కీలక ప్రాజెక్టులను శంకుస్థాపన, ప్రారంభం చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పరిశ్రమ, విద్యుత్, రహదారులు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువు రంగాలకు సంబంధించినవి. ఇవి రాష్ట్ర మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి సృష్టి లక్ష్యాలకు దోహదం చేస్తాయి.
ఈ సందర్భంగా కర్నూలులో జరగనున్న ప్రధాని మోదీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఓర్వకల్లు మండలం శివారు నన్నూరు టోల్గేట్ సమీపంలో సుమారు 450 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం మూడు లక్షల మంది వరకూ కూర్చునేందుకు వీలుగా మూడు సభా ప్రాంగణాలను సిద్ధం చేశారు.
కర్నూలు-III పూలింగ్ స్టేషన్లో రూ.2,880 కోట్ల వ్యయంతో ‘ట్రాన్స్మిషన్ సిస్టమ్ స్ట్రెంగ్తెనింగ్ ప్రాజెక్ట్’కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా 765కెవి డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ (కర్నూలు III-చిలకలూరిపేట) ఏర్పాటు కానుంది. దీని ద్వారా 6,000 ఎంవిఎ ట్రాన్స్ఫర్మేషన్ సామర్థ్యం పెరగనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియా, కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ఈ రెండు ప్రాజెక్టుల వ్యయం రూ.4,920 కోట్లు. ఎన్ఐసిడిఐటి, ఏపీఐఐసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత రూ.21,000 కోట్ల పెట్టుబడులు, ఒక లక్ష ఉద్యోగాలు రానున్నాయి. తొలుత ఉదయం 11:15 గంటలకు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో పూజా కార్యక్రమంలో పాల్గొని దర్శనం చేసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని సందర్శించనున్నారు.
ఈ స్మారక సముదాయం మధ్యలో ధ్యానంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం, చుట్టూ ప్రతాప్‌గఢ్, రాజ్‌గఢ్, రాయగఢ్, శివనేరి కోటల నమూనాలు ఏర్పాటు చేశారు. 1677లో శివాజీ మహారాజు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన చారిత్రక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ స్మారకం నిర్మించారు. అదేవిధంగా సబ్బవరం నుంచి విశాఖపట్నంలోని శీలానగర్ వరకూ ఆరు లేన్ గ్రీన్‌ఫీల్డ్ హైవే (రూ.960 కోట్లు)కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెంచుతుంది. అదే విధంగా రూ.1,140 కోట్ల విలువైన ఆరు రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
వీటిలో పీలేరు-కలూర్ నాలుగు లేన్ల రహదారి, కడప-నెల్లూరు సరిహద్దు రహదారి విస్తరణ, గుడివాడ-నూజెల్ల రైల్వే ఆర్ఓబి, పాపఘ్ని వంతెన, కనిగిరి బైపాస్, ఎన్.గుండ్లపల్లి బైపాస్ విస్తరణ ఉన్నాయి. వీటితో పాటు కొత్తవలస-విజయనగరం నాలుగో రైల్వే లైన్, పెందుర్తి-సింహాచలం నార్త్ రైల్వే పైవంతెన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొత్తవలస-బొడ్డవర, శిమిలిగూడ-గోరాపూర్ లైన్ డబ్లింగ్ పూర్తయిన రూ.1,200 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.
గెయిల్ సంస్థ నిర్మించిన శ్రీకాకుళం-అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ (రూ.1,730 కోట్లు)ను దేశానికి అంకితం చేయనున్నారు.
గెయిల్ సంస్థ నిర్మించిన శ్రీకాకుళం-అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ (రూ.1,730 కోట్లు)ను దేశానికి అంకితం చేయనున్నారు.
More Stories
వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణంలో ప్రారంభ వికాసం
ఆపరేషన్ సిందూర్‌లో 100 మందికి పైగా పాక్ సైనికులు హతం
బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు మృతి