వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఏపీ సిట్ బృందం వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇళ్లలో సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో సిట్ అధికారులు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ప్రశాసన్‌నగర్, యూసుఫ్‌గూడ గాయత్రీహిల్స్‌లోని మిథున్‌రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కొండాపూర్‌లోని ఆయన కార్యాలయంలోనూ తనిఖీలు జరిగాయి. తిరుపతిలోని మిథున్‌రెడ్డి నివాసం, కార్యాలయంలో సుమారు 3 గంటలపాటు సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
మద్యం కుంభకోణం కుట్రకు ప్రధాన రూపకర్త, మద్యం మాఫియా కుట్రల ప్రధాన అమలుదారు మిథున్‌రెడ్డేనని సిట్ నిగ్గుతేల్చిన సంగతి తెలిసిందే. ముడుపుల సొమ్మును నేరుగా ఆయనే అందుకునేవారని ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయం విదితమే. ముడుపుల్ని కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (ఏ1) వసూలు చేసి, ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్పల ద్వారా అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చేరవేసేవారని తెలిపింది.
మనీలాండరింగ్, బలవంతపు వసూళ్లలో మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైందని సిట్ పేర్కొందని. నెలకు రూ.50-60 కోట్ల వరకు వసూళ్లకు పాల్పడ్డారని తెలిపింది. ముడుపులు అందిన బ్రాండ్‌లనే విక్రయించేందుకు వీలుగా మద్యం విధానాన్ని రూపొందించారని తెలిపింది. సాక్షులిచ్చిన వాంగ్మూలం, ఆర్థిక లావాదేవీలు, సాక్ష్యాధారాలు, ఈమెయిళ్లను విశ్లేషించాక ఆయన కుట్రపూరిత పాత్రను నిర్ధారించినట్లు వెల్లడించింది.
ఏపీఎస్‌బీసీఎల్ విషయంలో ఎలాంటి అధికారం లేకపోయినా ‘డిఫ్యాక్టో కంట్రోలర్’గా వ్యవహరించారని తెలిపింది. ముడుపులిచ్చిన ప్రైవేటు డిస్టలరీస్‌కు ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు ఇచ్చి, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చారని తెలిపింది. పారదర్శకంగా జరిగే మద్యం విక్రయ విధానానికి తూట్లుపొడిచి ముడుపులందిన కంపెనీల సరకు విక్రయానికి నేరపూరిత వ్యూహ రచన చేసిన వారిలో మిథున్‌రెడ్డి కీలకమని వివరించింది.
ముడుపులను వివిధ షెల్ కంపెనీలు, బినామీలు, రాజకీయ సంబంధ వ్యాపారాల ద్వారా మళ్లించినట్లు పేర్కొంది. ఎక్సైజ్‌శాఖ, ఏపీఎస్‌బీసీఎల్‌లలో ఎలాంటి పోస్టు నిర్వహించనప్పటికీ మద్యం విధాన రూపకల్పనను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనే ప్రభావితం చేసినట్లు తేలిందని తెలిపింది. ఎక్సైజ్ వ్యవహారాల్లో పెద్దగా అనుభవంలేని సత్యప్రసాద్(ఏ3)ని ఏపీఎస్‌బీసీఎల్ ప్రత్యేక అధికారిగా నియమించడంలో ఆయన పాత్ర ఉందని పేర్కొంది.
మిథున్‌రెడ్డి ఆదేశాల మేరకు లిక్కర్ సిండికేట్ సభ్యులు రాజ్ కెసిరెడ్డి, ఆయన తోడల్లుడు అవినాశ్‌రెడ్డి తదితరులు విజయసాయిరెడ్డి ఇంట్లో సమావేశమయ్యారని తెలిపింది. మద్యం బేసిక్ ధరలో 12 శాతం ముడుపుల రూపంలో తీసుకోవడాన్ని ప్రారంభించి 20 శాతానికి పెంచారని గతంలోనే వివరించింది.
More Stories
విశాఖలో రూ.88 వేల కోట్లతో దేశంలో తొలి గూగుల్ ఎఐ హబ్
తిరుమల పరకామణి రికార్డ్స్ సీజ్ చేయలేదు.. నిద్రపోతున్నారా!
చంద్రబాబుకు అమరావతి రైతులు 10 రోజుల అల్టిమేటం!