హరియాణా డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం

హరియాణా డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వై.పూరన్‌ కుమార్‌(52) ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపణలున్న హరియాణా డీజీపీ శత్రుజీత్‌ కపూర్​ ను  సెలవుపై పంపించింది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహ్​తక్​ ఎస్​పీ నరేంద్ర బిజర్నియాను ఇప్పటికే ఉన్నతాధికారులు బదిలీ చేశారు.  ఈ క్రమంలోనే డీజీపీ శత్రుజీత్ కపూర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
48 గంటల్లోగా డీజీపీని పదవి నుంచి తొలగించాలని, లేని పక్షంలో హరియాణా, చండీగఢ్ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 5లక్షల వాల్మీకి సమాజానికి చెందిన ఉద్యోగులు రాజీనామా చేస్తారని హెచ్చరించారు.  ఈ నేపథ్యంలోనే డీజీపీ శత్రుజీత్​ను సెలవుపై పంపించామని హరియణా ముఖ్యమంత్రి మీడియా సలహాదారు రాజీవ్ జైట్లీ తెలిపారు. 
దళితులపై జరుగుతున్న దాడులపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, హర్యానాలోని బిజెపి ప్రభుత్వం డిజిపిని మార్చడం ద్వారా దళితులకు బలమైన సంకేతాన్ని పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.  పూరన్‌ కుమార్​ బలవన్మరణానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో డీజీపీ శత్రుజీత్, రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర పేర్లను చేర్చాలంటూ ఆయన భార్య సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి అమ్నీత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. 
ఆయన బలవన్మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీకి అమ్నీత్‌ ఇప్పటికే లేఖ రాశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌ సైనీ, దోషులు ఏ స్థాయివారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. మరోవైపు వారిపై చర్యలు తీసుకుంటేనే, పూరన్‌ కుమార్‌ మృతదేహానికి పరీక్షలు, అంత్యక్రియలకు అనుమతిస్తామని కుటుంబసభ్యులు పట్టుబట్టారు. దీంతో గత వారం రోజులుగా దీనిపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. 
సీనియర్‌ ఐపీఎస్​ పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య తీవ్రమైన అంశమని పంజాబ్​ గవర్నర్​ గులాబ్​ చంద్​ కటారియా ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఆర్ గమనిస్తే ఈ అంశం తీవ్రత అర్థమవుతుందని తెలిపారు. ప్రజల్లో నెలకొన్న అగ్రహాన్ని తగ్గించేలా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.