రెండు సంవత్సరాల రక్తపాత యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించే లక్ష్యంతో గాజా కాల్పుల విరమణ ఒప్పంద పత్రంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా ఎల్-సిసి, ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని, టర్కిష్ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ సోమవారం సంతకం చేశారు. ఈ సందర్భంగా `గాజా యుద్ధం ముగిసింది’ అని ట్రంప్ ప్రకటించారు.
ఈజిప్ట్ ఎర్ర సముద్రంలోని షర్మ్ ఎల్-షేక్ రిసార్ట్‌లో ఈజిప్ట్ నిర్వహించిన అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశంలో ఈ పత్రంపై సంతకం చేశారు, అదే రోజున హమాస్ తన మొదటి దశలో భాగంగా 20 మంది బందీలను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత నెలలో 20 అంశాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత అరబ్ మధ్యవర్తులు ఈజిప్ట్, ఖతార్, టర్కీ హమాస్, ఇజ్రాయెల్‌లను శత్రుత్వాలను ముగించడం, బందీలను విడుదల చేయడంపై ఒక అంగీకారానికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు.
“ఇది నిలబడబోతోంది” అని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు, ఎల్-సిసి, ఎర్డోగన్, షేక్ తమీమ్ కాల్పుల విరమణ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శాంతి ప్రణాళికను సమర్థిస్తాయని భావిస్తున్న రెండు పార్టీలు- ఇజ్రాయెల్,హమాస్ లకు సంతకం కార్యక్రమంలో ప్రాతినిధ్యం లేదు. ముందుగా ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఈజిప్టుకు వెళ్లిన ట్రంప్, గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని “చారిత్రాత్మకమైనది” అని అభివర్ణిస్తూ, “ఇది జరుగుతుందని ఎవరూ అనుకోలేదు” అని పేర్కొన్నారు. “సంవత్సరాల బాధలు, రక్తపాతం తర్వాత, గాజాలో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు విశ్వాసం వ్యక్తం చేశారు.
“మానవతా సహాయం ఇప్పుడు వెల్లువెత్తుతోంది. వందలాది ట్రక్కుల ఆహారం, వైద్య పరికరాలు, ఇతర సామాగ్రితో సహా, దానిలో ఎక్కువ భాగం ఈ గదిలోని ప్రజలే చెల్లిస్తున్నారు. పౌరులు తమ ఇళ్లకు తిరిగి వస్తున్నారు, బందీలు [వారి కుటుంబాలతో] తిరిగి కలుస్తున్నారు” అని ట్రంప్ ప్రకటించారు. “కొత్త, అందమైన రోజు ఉదయిస్తోంది. ఇప్పుడు పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది” అని ఆయన “ఈ అద్భుతమైన పురోగతిని సాధ్యం చేయడంలో సహాయపడిన అరబ్, ముస్లిం దేశాలకు తన గొప్ప కృతజ్ఞతలు” వ్యక్తంచేశారు.
గాజా కాల్పుల విరమణను సాధ్యం చేసినందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్, యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ లతో పాటు ఇతరులకు కూడా ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు, శాంతి ఒప్పందంలో భాగంగా అటు హమాస్, ఇటు ఇజ్రాయిల్ తమ వద్ద గల బందీలు, నిర్బంధితులను విడుదల చేశాయి. దీంతో అటు జెరూసలేంలో, ఇటు గాజాలో బంధువులు, కుటుంబ సభ్యుల ఆనందాలకు హద్దు లేకుండా పోయింది.
కాగా, గడచిన 24 గంటల్లో కూలిపోయిన శిథిలాల కింద నుంచి 60 మృతదేహాలను వెలికితీసినట్లు గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చి గాజాలోని కొన్ని భాగాల నుంచి ఇజ్రాయెలీ సైనిక బలగాలు తప్పుకున్న తర్వాత గడచిన నాలుగు రోజుల్లో 200 మృతదేహాలను శిథిలాల నంచి వెలికితీశారు.
కాగా, గాజాలో యుద్ధం ముగిసిందన్న ట్రంప్ వ్యాఖ్యలను హమాస్ అధికార ప్రతినిధి స్వాగతించారు. ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించకుండా మధ్యవర్తులు, అంతర్జాతీయ సమాజం చూడాలని హమాస్ ప్రతినిధి హజెమ్ కసెమ్ టెలిగ్రాం ద్వారా విజ్ఞప్తి చేశారు. తీవ్ర వేదనను అనుభవించిన గాజాలోని ఇజ్రాయెలీ బందీలు విడుదలై తమ కుటుంబ సభ్యులను ఎట్టకేలకు చేరుకోనుండడంపై ఐక్యరాజ్యసమితి(యూఎన్) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సంతృప్తి వ్యక్తం చేశారు. గుండెల మీద నుంచి పెద్ద భారం తొలగినట్లు ఉందని వ్యాఖ్యానించారు.
More Stories
14 ఏళ్ళ తర్వాత సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ క్షమాపణలు
కేరళలో మంత్రిపదవిపై సురేష్ గోపి, బీజేపీల సంధిగ్ధత
కర్ణాటక కాంగ్రెస్ లో `ఆర్ఎస్ఎస్ నిషేధ’ దుమారం