100 శాతం పిఎఫ్ నిధులు ఉపసంహరించుకోవచ్చు

100 శాతం పిఎఫ్ నిధులు ఉపసంహరించుకోవచ్చు

ఈపీఎఫ్ఓ సోమవారం ఏడు కోట్లకు పైగా ఉన్న పీఎఫ్ ఖాతాదారుల కోసం విత్డ్రా నిబంధనలను సరళీకరించింది. ఇకపై ప్రత్యేక సందర్భాల్లో ఖాతాదారులు తమ ఈపీఎఫ్ అకౌంట్లోని 100 శాతం నిధులను ఉపసంహరించుకునేందుకు వీలు కల్పించింది. కేంద్ర కార్మిక శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశమై పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది.

ఈపీఎఫ్ ఖాతాదారులకు మరింత సౌలభ్యం కలిగించేందుకు, సీబీటీ 13 సంక్లిష్టమైన నిబంధనలను కలిపి, ఒక నిబంధనలోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం, అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు లాంటి అత్యవసర సమయాల్లో 100 శాతం పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఇప్పుడు ఉద్యోగులు తమ వాటాతో సహా యజమాని జమ జమ చేసిన పీఎఫ్ డబ్బులు కూడా పూర్తిగా విత్డ్రా చేసుకోవచ్చు.

ఇంతకు ముందు వివాహం, విద్య రెండింటికీ కలిపి కేవలం 3 సార్లు మాత్రమే పీఎఫ్ అకౌంట్ నుంచి పాక్షిక ఉపసంహరణలు చేసుకోవడానికి వీలుండేది. కానీ దానిని ఇప్పుడు మరింత సరళీకరించారు. ఇకపై విద్య కోసం 10 సార్లు, వివాహం కోసం 5సార్లు ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరించుకునే వీలు కల్పించారు. అలాగే ఉద్యోగులు ఎవరైనా పీఎఫ్ విత్డ్రా చేయాలంటే, కనీసం 12 నెలల సర్వీస్ ఉండాలని నిర్దేశించారు.

గతంలో పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించాలంటే, కచ్చితంగా దానికి తగిన కారణాలు చెప్పాల్సి ఉండేది. అంటే ప్రకృతి వైపరీత్యాలాలు, లాకౌటులు/ సంస్థల మూసివేత, నిరంతర నిరుద్యోగం, అంటువ్యాధులు మొదలైన అత్యవసర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు ఈపీఎఫ్ఓకు చెప్పాల్సి ఉండేది.  దీని వల్ల తరచుగా క్లెయిమ్లు రిజెక్ట్ కావడం, దీనితో ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు రావడం పరిపాటిగా ఉండేది. ఇకపై ఈపీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ఎలాంటి కారణాలు చెప్పాల్సిన పనిలేదు.

అయితే, పీఎఫ్ ఖాతాదారులు తమ కంట్రిబ్యూషన్లో కనీసం 25 శాతాన్ని ఎల్లప్పుడూ నిర్వహించాలని ఒక నిబంధన తీసుకువచ్చారు.  దీని వల్ల ఈపీఎఫ్ఓ ఇచ్చే అధిక వడ్డీ రేటు (ప్రస్తుతం సంవత్సరానికి 8.25 శాతం) లభిస్తుంది. దీని వల్ల పెద్ద మొత్తంలో పదవీ విరమణ నిధి సమకూరే అవకాశం ఉంటుంది. ఈ హేతుబద్దీకరణ వల్ల ఖాతాదారులకు అవసర సమయాల్లో నిధులు అందుతాయి. చివరకి పదవీ విరమణ సమయంలో కూడా పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి వస్తాయి.

ఈ తాజా నిబంధనల వల్ల ఖాతాదారులు ఎలాంటి పత్రాలు సమర్పించకుండానే తమ పీఎఫ్ డబ్బులను 100 శాతం క్లెయిమ్ చేసుకునే వీలు కలుగుతుంది. పీఎఫ్ వ్యాజాల పరిష్కారం కోసం ఈపీఎఫ్ఓ ఇప్పుడు ‘విశ్వాస్ పథకం’ను ప్రారంభించింది. పీఎఫ్ బకాయిల చెల్లింపులు ఆలస్యం కావడం లాంటి సమస్యలకు దీని ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపింది.  ఈ పథకం 6 నెలలపాటు అమలులో ఉంటుంది. తరువాత మరో 6నెలలు దానిని పొడిగిస్తారు. 

ఇది పీఎఫ్ ఖాతాదారులకు, పెన్షనర్లకు ఉపయుక్తంగా ఉంటుందని ఈపీఎఫ్ఓ తెలిపింది.  అంతేకాదు ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా పీఎఫ్ సేవలను ఆధునికీకరించడానికి సీబీటీ – “కాప్రిహెన్సివ్ మెంబర్-సెంట్రిక్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రేమ్వర్క్”ను ఆమోదించింది. దీని ద్వారా వేగంగా, ఆటోమేటిక్గా క్లెయిమ్ సెటిల్మెంట్ జరిగిపోతుంది. అంతేకాదు వివిధ భాషల్లో సెల్ఫ్-సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.