రెండు గంటల్లో హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం!

రెండు గంటల్లో హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం!

తెలంగాణ రాజధాని హైదరాబాద్  ఆంధ్రప్రదేశ్ వాణిజ్య కేంద్రం విజయవాడ  మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గబోతోంది. 6-7 గంటల సమయాన్ని కేవలం 2 గంటల్లోనే చేరుకునేలా ఒక బృహత్తర ప్రాజెక్టు శరవేగంగా ముందుకు కదులుతోంది. రెండు నగరాల మధ్య కొత్త 6-లేన్ల హైవే నిర్మించడం ద్వారా రెండు నగరాల మధ్య దూరం కేవలం 2 రెండు గంటలకు తగ్గుతుందని భావిస్తున్నారు. 
 
235 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త మార్గం అందుబాటులోకి వస్తే, ఇది ఈ ప్రాంత కనెక్టివిటీకి ఒక గేమ్ ఛేంజర్ గా మారనుంది. ప్రస్తుతం విజయవాడ – హైదరాబాద్ మధ్య ఎన్హెచ్-65 ఉంది. ఇది నాలుగు లేన్ల రహదారి. దీన్ని 6 లేన్లకు విస్తరించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు దీనికి మోక్షం కలుగుతోంది. ఈ జాతీయ రహదారిని 6 లేన్లకు విస్తరించడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని ప్రమాదరహితంగా తీర్చిదిద్దనున్నారు. 
 
2 గంటల్లో ప్రయాణం సాధ్యమయ్యేలా యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ ప్రెస్ హైవేని నిర్మిస్తారు. అంటే ఇరువైపులా కంచె వేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తారు. తద్వారా గరిష్ట వేగం సాధ్యమవుతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి చౌటుప్పల్, నార్కట్ పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, మునగాల, చిల్లకల్లు, నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ వరకూ ఈ రహదారి ఉంటుంది.

సాధారణంగా రోడ్డు ప్రాజెక్టుల్లో ఎదురయ్యే జాప్యాలకు భిన్నంగా, ఈ మెగా ప్రాజెక్టు పనులు శరవేగంగా కదులుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్లను వచ్చే ఏడాది మార్చి నాటికి ఖరారు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పనులు వేగంగా పూర్తి చేసి, రోడ్డును త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

 
ఈ 6-లేన్ల హైవేను అత్యాధునిక ప్రమాణాలతో డిజైన్ చేస్తున్నారు. వాహనాలు సురక్షితంగా, సమర్థవంతంగా, గరిష్ట వేగంతో ప్రయాణించడానికి వీలుగా రోడ్డు నిర్మాణం జరగనుంది. తద్వారా వేగాన్ని పెంచినా, భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చూసుకోవడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.

ఈ ప్రాజెక్టు పూర్తయితే, ఈ రెండు నగరాలతో పాటు మార్గం వెంబడి పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద, ఈ కొత్త 6-లేన్ల రహదారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాణిజ్యం, ఆర్థిక వృద్ధి, ప్రజల ప్రయాణానికి మరింత సౌలభ్యం చేకూర్చనుంది. కీలకమైన మౌలిక సదుపాయాల మార్పుకు నాంది పలకనుంది.