చంద్రబాబుకు అమరావతి రైతులు 10 రోజుల అల్టిమేటం!

చంద్రబాబుకు అమరావతి రైతులు 10 రోజుల అల్టిమేటం!
ఏపీలో అమరావతి రాజధాని ప్రాంతంలో పనుల్ని తిరిగి ప్రారంభించిన కూటమి సర్కార్ ఇప్పుడు వాటిని పరుగులు తీయిస్తున్నట్లు చెబుతోంది. అయితే రైతుల విషయంలో మాత్రం ఆశించిన స్ధాయిలో న్యాయం జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు మొదటిసారిగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ సమస్యల పరిష్కారంపై 10 రోజుల గడువు ఇస్తూ అల్టిమేటం జారీ చేశారు.
 
రైతులు, రైతు కూలీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నారని, సిఆర్డిఏ అధికారుల అవినీతి గురించి పట్టించుకోవడం లేదని, తమకు ఉపాధి కల్పించడం గురించి ప్రభుత్వం శ్రద్ద వహించడం లేదని అంటూ ఆదివారం గుంటూరులో జరిగిన అమరావతి రైతు జెఎసి సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు. పది రోజుల్లో ప్రభుత్వం స్పందించక పోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు హెచ్చరించారు.
 
కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు అయినప్పటికీ రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు. అనేకసార్లు సిఆర్‌డిఏ అధికారులు, మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణకు వినతిపత్రాలు ఇచ్చినా, గ్రీవెన్స్‌ సదస్సులలోనూ, వారి దృష్టికి తీసుకువచ్చినా నేటి వరకూ పరిష్కారం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
అసైన్డ్‌ రైతుల సమస్య, కౌలు చెల్లింపు క్రమబద్దీకరణ, రోడ్డుపోటు ప్లాట్ల సమస్య, ప్లాట్ల కేటాయింపు సమస్య, గ్రామ కంఠాల సమస్య, అసంబద్ధమైన ఎఫ్‌ఎస్‌ఐ విధానం, ఇతర సమస్యల పట్ల అధికారుల, ప్రభుత్వ అలసత్వ ధోరణి, క్రిందిస్తాయి అధికారుల అవినీతి చర్యలపై నిర్లక్ష్య ధోరణి పట్ల రైతులు, రైతు కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి సమక్షంలో చర్చలు జరగాలని వారు డిమాండ్ చేశారు.
 
సిఆర్డియే కార్యాలయం ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ  రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో భూములిచ్చిన రైతులను సభ్యులుగా నియమించాలని జేఏసి అధ్యక్షుడు మాదల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏ గ్రామంలోని రైతులకు ఆ గ్రామంలోనే ప్లాట్ లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినా, క్రింది స్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని విస్మయం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ అమరావతి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపించిన రైతుల భాగస్వామ్యం, స్వయం ఉపాధి రూపకల్పనలో వైఫల్యం వల్ల రైతులు, రైతు కూలీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారని వారు తెలిపారు. అమరావతి ఉద్యమంలో ముందుండి పోరాడిన అమరావతి ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి)పై తీవ్ర ఒత్తిడి వస్తున్నందువల్ల గుంటూరులో జేఏసీ సమావేశమై పలు డిమాండ్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.