ఆఫ్ఘన్ సరిహద్దులో 12 మంది పాక్ సైనికుల మృతి

ఆఫ్ఘన్ సరిహద్దులో 12 మంది పాక్ సైనికుల మృతి
పాకిస్తాన్ – ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇరు దేశాల మ‌ధ్య తూటాల‌ వ‌ర్షం కురుస్తోంది. తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘ‌న్ దళాలు డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న అనేక పాక్ ఆర్మీ ఔట్ పోస్టుల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో పాక్ – ఆఫ్ఘ‌న్ స‌రిహ‌ద్దు వెంట శ‌నివారం అర్ధ‌రాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి.  ఖైబ‌ర్ – పఖ్తుంక్వా, బ‌లూచిస్థాన్ – డాన్ స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన కాల్పుల్లో పాక్ సైనికులు 12 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టు ఆఫ్ఘ‌న్ ప్ర‌క‌టించింది.
మ‌రోవైపు ఆఫ్ఘ‌న్ సైనికులు కూడా మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది.  ఇక ఆఫ్ఘ‌న్ స్వాధీనం చేసుకున్న పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టుల్లో అస్థిర కునార్, హెల్మండ్ ప్రావిన్సులు కూడా ఉన్నాయ‌ని ఆఫ్ఘ‌న్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.  బ‌హ్రంచా జిల్లాలోని ష‌కీజ్, బీబీ జాని, స‌లేహాన్ ప్రాంతాల్లో, ఫఖ్తుంక్వాలోని అర్యుబ్ జాజీ జిల్లా అంత‌టా కాల్పులు జ‌రిగిన‌ట్లు పేర్కొన్నారు.
ఈ సంద‌ర్భంగా ఆప్ఘ‌నిస్తాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి ఎనాయ‌తుల్లా ఖోవ‌రాజ్మి మాట్లాడుతూ పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు ప్ర‌తీకార చ‌ర్య‌గా ఈ దాడుల‌ను అభివ‌ర్ణించారు.  శ‌నివారం అర్ధ‌రాత్రి నాటికి ఘ‌ర్ష‌ణ‌లు ముగిశాయ‌ని పేర్కొన్నారు. మ‌రోసారి పాక్ గ‌గ‌న‌త‌ల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డితే దాడులు మ‌రింత తీవ్రంగా ఉంటాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. పాక్ గ‌గ‌న‌త‌లాన్ని త‌ప్ప‌కుండా తాము ఆక్ర‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు.
 
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య వరుసగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు ఘర్షణ జరిగింది. అక్టోబర్ 9న, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రావిన్సులలో వైమానిక దాడులు ప్రారంభించింది, ఆ గ్రూప్ నాయకుడు నూర్ వలీ మెహ్సుద్ సహా తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) సీనియర్ కమాండర్లను లక్ష్యంగా చేసుకుంది.
 
వైమానిక దాడులకు ప్రతిస్పందనగా, ఆఫ్ఘన్ దళాలు డ్యూరాండ్ లైన్ సమీపంలోని పాకిస్తాన్ సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి ప్రారంభించాయని ఆరోపణలు ఉన్నాయి. నంగర్హార్, కునార్ ప్రావిన్సులలోని అనేక పాకిస్తాన్ అవుట్‌పోస్టులను ఆఫ్ఘన్ దళాలు విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నాయని, ఈ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక ఉనికికి గణనీయమైన దెబ్బ తగిలిందని నివేదికలు సూచిస్తున్నాయి.