మూడో తరగతి నుంచే ఏఐ!

మూడో తరగతి నుంచే ఏఐ!
విద్యారంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3వ తరగతి నుంచే విద్యార్థులందరికీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ని పాఠశాలలో తప్పనిసరిగా చేర్చాలని విద్యా మంత్రిత్వశాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీనికి సంబంధించి ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 
రాబోయే రెండు మూడు సంవత్సరాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సాంకేతికతతో సరిగ్గా సమన్వయం చేసుకునేలా మనం వేగంగా ముందుకు సాగాలి. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉపాధ్యాయులను చేరుకోవడం,  ఏఐ -సంబంధిత విద్యను అందించడంలో వారికి దిశానిర్దేశం చేయడం సవాలుగా ఉంటుంది. సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) అన్ని తరగతులలో ఏఐ ఏకీకరణ కోసం ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది” అని పాఠశాల విద్యా కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. 
 
పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఉపాధ్యాయుల కోసం ఏఐ సాధనాలను ఉపయోగించే పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే జరుగుతోందని కుమార్ వెల్లడించారు. “డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం అభ్యాసకుడిని, ఉపాధ్యాయుడిని సిద్ధం చేయడమే మా లక్ష్యం” అని ఆయన చెప్పారు.

ఈ ఫ్రేమ్‌వర్క్‌ను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం 18 వేలకుగాపైగా సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఏఐని ఒక నైపుణ్య కోర్సుగా అందిస్తున్నారు. ఏఐ, ఉద్యోగాలపై నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ఏఐ కారణంగా సుమారు 20 లక్షల సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగైనా, సరైన వాతావరణాన్ని సృష్టిస్తే 80 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.

శిక్షణ పొందిన ప్రతిభను రేపటి ఆవిష్కర్తలు, పరిశోధకులుగా రూపొందించడానికి కంప్యూట్ మౌలిక సదుపాయాలు, డేటా లభ్యత ఎకానమీని సృష్టించడానికి ప్రతిపాదిత ఇండియా ఏఐ టాలెంట్ మిషన్, కొనసాగుతున్న ఇండియా ఏఐ మిషన్ మధ్య సన్నిహిత సహకారం, విద్యాసంస్థలు, ప్రభుత్వం, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలతో పాటు నివేదిక సూచించింది.

ఏఐ రంగంలో భారత భవిష్యత్తు కోసం ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని, తగినంత మౌలిక సదుపాయాలు కల్పించాలని నివేదిక సిఫార్సు చేసింది. ఈ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటే, ఏఐ రంగంలో భారత్‌ కేవలం తన ఉద్యోగులను కాపాడుకోవడమే కాకుండా, ప్రపంచ ఏఐ పటంలో నాయకత్వం వహించగలదని నివేదిక స్పష్టం చేసింది. ఏఐ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ భవిష్యత్తు నిర్ణయాత్మక చర్యపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.