చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల 

చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల 

మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా అసాధారణంగా పెరగడానికి అక్రమ చొరబాట్లే ప్రధాన కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదని, దేశ భద్రతకు, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిణమించిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.  శుక్రవారం నాడు ‘దైనిక్ జాగరణ్’ మాజీ సంపాదకులు నరేంద్ర మోహన్ స్మారక ఉపన్యాసంలో ‘చొరబాటు, జనాభా మార్పు, ప్రజాస్వామ్యం’ అనే అంశంపై మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లోని జనాభా లెక్కలను ఉటంకిస్తూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో ముస్లిం జనాభా పదేళ్లలో 29.6 శాతం పెరిగిందని, చొరబాట్లు లేకుండా ఈ స్థాయిలో వృద్ధి అసాధ్యమని పేర్కొన్నారు.  పశ్చిమబెంగాల్‌లోని పలు జిల్లాల్లో ముస్లిం జనాభా వృద్ధి రేటు 40 శాతం వరకు, సరిహద్దు ప్రాంతాల్లో ఏకంగా 70 శాతం వరకు ఉందని తెలిపారు. ఇవన్నీ గతంలో జరిగిన చొరబాట్లకు నిదర్శనమని విమర్సించారు.

కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు.  గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు కూడా సరిహద్దులు ఉన్నాయని, మరి అక్కడ నుంచి చొరబాట్లు ఎందుకు జరగడం లేదని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు. చొరబాట్లను అడ్డుకోవడం కేవలం కేంద్ర ప్రభుత్వం, సరిహద్దు భద్రతా దళాల బాధ్యత మాత్రమే కాదని స్పష్టం చేశారు.

దేశ భౌగోళిక పరిస్థితుల కారణంగా అన్ని సరిహద్దు ప్రాంతాల్లో కంచె వేయడం సాధ్యం కాదని, అలాంటి చోట్ల రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అత్యంత కీలకమని చెప్పారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని స్థానిక జిల్లా యంత్రాంగం గుర్తించడంలో విఫలమైతే చొరబాట్లను ఎలా ఆపగలమని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాట్ల కారణంగానే జార్ఖండ్‌లో ఆదివాసీ జనాభా గణనీయంగా తగ్గిపోతోందని అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి దేశ జనాభా నిర్మాణంలో వస్తున్న ఈ మార్పులు, జాతీయ భద్రతపై దీర్ఘకాలికంగా చూపే ప్రభావంపై అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.