చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు 

చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు 
అరుదైన ఖనిజాల ఎగుమతి చైనా ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలోకి ప్రవేశించే ఆ దేశ వస్తువులపై భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. తాజాగా చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇవి నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికే చైనా వస్తువులపై 30శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. 
 
తాజా టారీఫ్‌లతో అవి 130 శాతానికి పెరిగాయి. అదేవిధంగా క్రిటికల్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇతర దేశాలతో పంచుకోవడంపై నియంత్రణ విధిస్తున్నట్లు వివరించారు. అదే రోజు నుంచి అన్ని కీలక సాఫ్ట్‌వేర్‌లపై ఎగుమతి నియంత్రణలు కూడా విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు.  వాణిజ్యంపై చైనా అసాధారణ రీతిలో దూకుడుగా వ్యవహరిస్తుందన్న ట్రంప్‌ ఆ దేశ ఉత్పత్తులతో పాటు అక్కడి నుంచి దిగుమతయ్యే అన్ని వస్తువులపైనా పెరిగిన సుంకాలు అమలవుతాయని తెలిపారు.
ఇది మినహాయింపు లేకుండా అన్ని దేశాలను ప్రభావితం చేయిస్తుందని తన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. చైనా తీసుకునే తదుపరి చర్యల ఆధారంగా సుంకాలపై అమెరికా నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.  అమెరికా తయారుచేసే దాదాపు ప్రతి ఉత్పత్తి పైనా భారీగా ఎగుమతి ఆంక్షలు విధించాలని చైనా యోచిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.  అరుదైన ఖనిజాలపై ఆంక్షలు విధంచడాన్ని అత్యంత శత్రుత్వంతో కూడుకున్న చర్యగా అభివర్ణించారు.
చైనా తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలకు నష్టం కలిగిస్తుందని చెప్పుకొచ్చారు.  అంతేకాదు, చైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తాను అనుకోలేదని వివరించారు. తన చర్యల ద్వారా ప్రపంచాన్ని బందీ చేయాలని చేస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే దాదాపు ప్రతి ఉత్పత్తిపై ఇప్పటికే భారీ టారిఫ్‌లు అమలులో ఉన్నాయి.
 
ప్రస్తుతం సగటు టారిఫ్ రేటు దాదాపు 40శాతంగా ఉంది, ఇందులో స్టీల్, అల్యూమినియంపై 50శాతం, వినియోగ వస్తువులపై 7.5శాతం వరకు సుంకాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఫైటర్ జెట్‌ల వరకు అనేక ఉత్పత్తుల్లో ఉపయోగించే రేర్ ఎర్త్‌ ఖనిజాల ప్రాసెసింగ్‌లో ప్రపంచ ఆధిపత్యం చైనాదే. ప్రపంచంలో అరుదైన ఖనిజాల మైనింగ్‌లో చైనా వాటా దాదాపు 70 శాతంగా ఉంది. ప్రపంచ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్‌లో దాదాపు 90శాతం కూడా చైనా నియంత్రణలో ఉంది.