ఐపీఎస్ అధికారి పూరన్‌ ఆత్మహత్యపై సిట్‌

ఐపీఎస్ అధికారి పూరన్‌ ఆత్మహత్యపై సిట్‌
హర్యానా అదనపు డీజీపీ వై పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేస్తున్నట్టు చండీగఢ్‌ పోలీస్‌ చీఫ్‌ సాగర్‌ ప్రీత్‌ హుడా శుక్రవారం ప్రకటించారు. ఈ సిట్‌కు ఐజీ పుష్పేందర్‌ కుమార్‌ నేతృత్వం వహిస్తారని తెలిపారు.  ఇందులో చండీగఢ్ ఎస్‌ఎస్‌పి కన్వర్‌దీప్ కౌర్, డిఎస్‌పి చరణ్‌జిత్ సింగ్ విర్క్, ఎస్‌డిపివో(దక్షిణం) గుర్జిత్ కౌర్, సెక్టార్ 11 పోలీస్ స్టేషన్(పశ్చిమ) ఎస్‌హెచ్‌వో జైవీర్ రాణా కూడా సభ్యులుగా ఉంటారని అధికార ఉత్తర్వులో పేర్కొన్నారు.
 
‘సిట్ ఎఫ్‌ఐఆర్ నంబర్ 156/2025లోని అన్ని అంశాలను దర్యాప్తు చేస్తుంది, ఇందులో సాక్ష్యాల సేకరణ, సాక్షుల పరిశీలన, నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం, న్యాయ సలహా తీసుకోవడం మొదలయినవి ఉంటాయి. దర్యాప్తు పూర్తయిన తర్వాత తుది నివేదికను తయారు చేస్తారు’ అని ఉత్తర్వు పేర్కొంది. తన భర్త ఆత్మహత్యకు రాష్ట్ర డీజీపీ శత్రుజీత్‌ సింగ్‌ కపూర్‌, రోహతక్‌ ఎస్‌పీ నరేంద్ర బిజార్నియాలే కారణమని ఆరోపిస్తూ పూరన్‌ కుమార్‌ భార్య, ఐఏఎస్‌ అధికారి అన్మీత్‌ కుమార్‌ గురువారం ఫిర్యాదు చేయడంతో హర్యానా ప్రభుత్వం వారిపై ఎట్టకేలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 

మరోవైపు, కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారం అసంపూర్తిగా ఉందంటూ ఆయన భార్య, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి అమ్నీత్‌ కుమార్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా నిందితులందరి పేర్లు అందులో నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కాపీ తనకు అందిందంటూ ఆమె పోలీసులకు శుక్రవారం ఓ లేఖ రాశారు. 

అయితే, ఎఫ్‌ఐఆర్‌లో నిందితులందరి పేర్లు ప్రస్తావించలేదని, వారందరినీ చేర్చాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సరైన సెక్షన్‌లను నమోదు చేయలేదని ఆరోపించారు. తన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితులు డీజీపీ శత్రుజీత్‌ సింగ్‌ కపూర్‌తో పాటు రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాల పేర్లు ప్రస్తావించక పోవడాన్ని ఆమె ప్రశ్నించారు. 

న్యాయమైన, పారదర్శక దర్యాప్తునకు అవసరమైన అన్ని వివరాలు అందులో ఉంచాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఐఆర్‌ను సవరించాలంటూ ఆమె పోలీసులను అభ్యర్థించారు కాగా, పూరన్‌కుమార్‌ మరణించి మూడు రోజులైనా ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు.