 
                బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో బీసీ రిజర్వేషన్లపై స్టే విధించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. 
చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈరోజు ఓబీసీలు ఎదుర్కొంటున్న దురవస్థకు కారణమని ధ్వజమెత్తారు.  
బీసీలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి, న్యాయపరమైన లొసుగులను సరిచేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  ఆగస్టు 31న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌కు పంపినప్పటికీ, గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఉన్న మూడు నెలల గడువు ముగియకముందే ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన విమర్శించారు. 
దేశ అత్యున్నత న్యాయస్థానం గవర్నర్‌కు పంపిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆ గడువు పూర్తికాకముందే ప్రభుత్వం తొందరపడి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తోందని ఆరోపించారు. 
ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూసి, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని రాంచందర్ రావు తెలిపారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు “బిజెపి అడ్డుకుంటోంది” అనే దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన అవగాహన లేదా ఆలోచనల స్పష్టత లేదని విమర్శించారు. బిజెపి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు పూర్తిగా మద్దతు ఇస్తూ దానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. 
బిల్లులు తెచ్చి, డిక్లరేషన్లు, ఆర్డినెన్స్ సవరణలు.. ఇలా న్యాయపరంగా చెల్లుబాటు కాని విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని, చట్టపరంగా తప్పుడు నిర్ణయాలతో బీసీల హక్కులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని మండిపడ్డారు.  మధ్యప్రదేశ్‌లో 57 శాతం రిజర్వేషన్ల కోసం బిజెపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడుతోందని, కాబట్టి బిజెపి రిజర్వేషన్లకు మద్దతుగా నిలుస్తోందని వివరించారు. 
కానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కేవలం ఓట్ల కోసం, రాజకీయ స్వలాభం కోసం బీసీలకు అన్యాయం చేస్తోందని రాంచందర్ రావు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల, వారి సాధికారత పట్ల నిజమైన చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. అసలు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసినవారే కాంగ్రెస్ పార్టీకి చెందినవారని రాంచందర్ రావు ఆరోపించారు.
                            
                        
	                    




More Stories
హైదరాబాద్ లో దేశీయ తొలి ప్రైవేట్ రాకెట్
అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై బీజేపీ ఫిర్యాదు
జూబ్లీ హిల్స్ లో ఓటమి భయంతో మంత్రివర్గంలోకి హజారుద్దిన్