పొంగులేటి ఒంటెత్తు పోకడలపైమహిళా మంత్రుల అసహనం

పొంగులేటి ఒంటెత్తు పోకడలపైమహిళా మంత్రుల అసహనం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం సమసిపోక ముందే మరో జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలు పొడచూపాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధిపత్య తీరుపై అదే జిల్లా మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఏకంగా కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.
ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అదే జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులపై చెలాయించే ఆధిపత్యం తాజాగా పరాకాష్ఠకు చేరిందని తెలుస్తున్నది. దీనికి మేడారం కేంద్రంగా జరిగే పనులే కేంద్ర బిందువుగా మారాయి.  వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతర నేపథ్యంగా జరిగే పనుల విషయంలో మంత్రి పొంగులేటి ఏకపక్ష ధోరణులపై మహిళా మంత్రులిద్దరూ రగిలిపోతున్నారు. 
 
ఇప్పటికే వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఏ ఇద్దరినీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలువనీయకుండా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పొంగులేటి ఆధిపత్యంపై మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల నవనిర్మాణం కోసం రూ.71 కోట్ల టెండర్లను ప్రభుత్వం పిలిచింది. దేవాదాయ శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే, ఆదివాసీ బిడ్డ, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయిన సీతక్కకు కనీస సమాచారం లేకుండానే టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందనే చర్చ సాగుతున్నది. గతనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌ తదితరులు మేడారం సందర్శించారు.

ఆ సమయంలో మేడారంలో చేపట్టనున్న పనులను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి వారానికి ఒకసారి అయినా సమీక్షించాలని సీఎం ఆ సందర్భంగా చెప్పారు. ఆ సమయంలోనే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సీతక్క, సురేఖ షాక్‌కు గురయ్యారని, దీనికితోడు అదే సభలో సంబంధిత మంత్రి కొండా సురేఖకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమాన పరిచారనే ఆరోపణలు వినిపించాయి.

వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనే అవకాశం, జిల్లాలో కొంతమంది ప్రజాప్రతినిధులను తమవాళ్లుగా మలుచుకొని రాజకీయాలు చేయడమే కాకుండా, ఆఖరికి మేడారం జాతర నిర్మాణాలపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే, తాజాగా మేడారం పనుల టెండర్ల ముసుగులో తన సంబంధీకులకు, తన జిల్లా వారికి పనులను కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. 

ఆ ఆరోపణలకు బలం చేకూరేలా పనుల కోసం టెండర్లకు వచ్చిన మూడు కంపెనీల్లో రెండు మంత్రి పొంగులేటి సన్నిహితులవని, ఒకటి ఇతరులది కావడంతోనే ఆ మంత్రులను దూరం పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. బిసీ సామాజికవర్గం, మహిళా మంత్రి అయిన కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి పెత్తనం ఏమిటి? అని ఆమెతో సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. 

తన మంత్రిత్వ శాఖలో తనకు తెలియకుండా టెండర్లు పిలవడంపై ఆగ్రహంగా ఉన్న ఆమె ఈ విషయంలో అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  మేడారం పనులకు టెండర్లు పిలవడం, ‘ముఖ్య’నేత ప్రధాన సలహా మండలి బాధ్యులు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ ఎమ్మెల్యే వ్యాపార భాగస్వామిగా ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన సంస్థకు కేటాయించడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన ఆ మంత్రి అన్ని విషయాలను అధిష్టానం ‘నోటీస్‌’కు చేరవేసే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తున్నది.