
గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని అందించడంలో ‘తెలంగాణ’ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా కితాబునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘టీ-ఫైబర్’ గ్రామాల పైలెట్ ప్రాజెక్టు దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ఆయన అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్ర ఐటి మంత్రులు, కార్యదర్శుల రౌండ్ టేండ్ స దస్సులో వినూత్న విధానాలతో డిజిటల్ సమ్మిళత్వానికి ‘తెలంగాణ’ బాటలు వేస్తుందంటూ రాష్ట్ర
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా అభినందించారు. ‘లాస్ట్-మైల్ ఫైబర్ కనెక్టివిటీ’ గ్రామీణ సమూహాలను ఎలా మార్చగలదో తెలంగాణ చేసి చూపించిందని కొనియాడారు. ‘టీ-ఫైబర్’ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాల కు కూడా సహకారం అందించాలని కోరారు. ఈ పైలెట్ ప్రాజెక్టును ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
డిజిటల్ సమానత్వం సమ్మిళిత వృద్ధికి పునాది అని, గ్రామీణ-, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పం అని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అందుకు అనుగుణంగానే పకడ్బందీ ప్రణాళికలను రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, వినూత్న విధానాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు.
భావితరాల కోసం పటిష్ఠమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని శ్రీధర్ బాబు వివరించారు. డిజిటల్ ఫలాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న చివరి వ్యక్తి వరకూ చేరాలన్నదే తమ లక్ష్యం అని, టీ- ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు తక్కువ ఖర్చుతో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
డిజిటల్ ఇండియా, భారత్ నెట్ లక్ష్యాలకు అనుగుణంగా ఫైబర్- టు -ది- హోమ్ నెట్‌వర్క్ ద్వారా ఈ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ వ్యవస్థాపకత తదితర సేవలను ప్రజల ముంగిటకే సమర్థవంతంగా చేర్చుతున్నామని చెప్పారు. ‘భారత్ నెట్’ అమలులో వేగం పెంచాలని, రైట్ ఆఫ్ వే సవాళ్లను పరిష్కరించాలని, దేశ, రాష్ట్రాల డిజిటల్ ఆస్తులను పరిరక్షించేందుకు సైబర్ భద్రత ఫ్రేమ్ వర్క్‌లను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని కోరారు.
ఈ అంశాల్లో రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
More Stories
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే
పొంగులేటి ఒంటెత్తు పోకడలపైమహిళా మంత్రుల అసహనం
జూబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ ఎందుకు పోటీ చేయడం లేదు?