
ఐరోపా యూనియన్ నుంచి వైదొలగిన తర్వాత జరిగిన భారత్- యూకే వాణిజ్య ఒప్పందం భారత్ అభివృద్ధికి లాంచ్ ప్యాడ్ లాంటిదని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తెలిపారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా భారత్లో పర్యటనకు వచ్చిన స్టార్మర్ బుధవారం ముంబయిలో పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి భారత పర్యటనకు వచ్చిన కీర్ స్టార్మర్ మహారాష్ట్ర ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం అందుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్ హాజరయ్యారు. స్టార్మర్ వెంట పారిశ్రామికవేత్తలు, వర్సిటీల ఉప కులపతులు సహా 125మంది ప్రతినిధులు వచ్చారు.
గురువారం జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో వారు పాల్గొంటారు. దీనికోసం 75 దేశాలకు చెందిన లక్షమంది ప్రతినిధులు, 7,500 కంపెనీల నుంచి 800 మంది వక్తలు హాజరు కానున్నారు. అంతకుముందు బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన 9100 విమానంలో స్టార్మర్ ముంబయికి వచ్చే క్రమంలో విమానంలోని కాక్పిట్ వద్దకు వెళ్లి ఇంటర్కామ్ ద్వారా ప్రధాని స్టార్మర్ ప్రయాణికులతో మాట్లాడారు. “ఇది ఎయిర్ సేఫ్టీ ప్రకటన కాదు. కాక్పిట్లో ఉన్నది మీ ప్రధానమంత్రి స్టార్మర్. ప్రయాణికులందరికీ హృదయపూర్వక స్వాగతం. మీరంతా విమానంలో ఉండటం అద్భుతంగా ఉంది” అని చెప్పారు.
“ఇప్పటివరకు జరగనివిధంగా భారత్- యూకే మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనుంది. మా కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోని అన్ని అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకునేందుకు మీతో కలిసి పనిచేసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అందరూ విమాన ప్రయాణాన్ని ఆస్వాదించండి. తర్వాత మరిన్ని విషయాలను మీకు అందిస్తా. థాంక్యూ” అని స్టార్మర్ తెలిపారు.
కాగా, ఈ ఏడాది జులైలో భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఎఫ్ టి ఏ సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరుదేశాల వాణిజ్యశాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతోపాటు ఏటా 34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
More Stories
26/11 ఉగ్రదాడికి ప్రతి దాడి చేయకుండా ఎవరాపారో చెప్పాల్సిందే!
మోహన్లాల్కి మరో అరుదైన గౌరవం
భారత నాగరిక ఆత్మ సంరక్షకునిగా వందేళ్ల ఆర్ఎస్ఎస్