
గాజాలో రెండేళ్లుగా కొనసాగుతున్న మారణకాండకు ముగింపు పలికేందుకు ఉద్దేశించిన శాంతి ప్రణాళికపై ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న పరోక్ష చర్చలు మంగళవారం కూడా కొనసాగాయి. సోమవారం చర్చలు సానుకూలం గా సాగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికను అమలు చేసేందుకు ఒప్పందం కుదిరే అవకాశాలు కన్పిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
ఎర్ర సముద్రం రిసార్ట్ నగరమైన షార్మ్ ఎల్‌షేక్‌లో జరిగిన చర్చలు సానుకూలంగా ఉన్నాయని, వాటిని ఎలా కొనసాగించాలనే విషయంపై ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారని ఆ వర్గాలు వివరించాయి. శాంతి ప్రణాళిక ఒప్పందంపై చర్చలు జరుగుతున్నందున తక్షణమే దాడులు ఆపాలని ట్రంప్ శుక్రవారం పిలుపునిచ్చినప్పటికీ గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు కొనసాగుతూనే వున్నాయని, బందీల విడుదల కోసం జరుగుతున్న చర్చలకు ఇది ప్రతిబంధకంగా మారుతుందని హమాస్ ప్రతినిధి బృందం మధ్యవర్తులకు తెలియజేసింది.
ఈ ప్రతినిధి బృందంలో హమాస్ నేతలు ఖలీల్ అల్-హయ్యా, జాహర్ జబారిన్ కూడా ఉన్నారు. గత నెలలో ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ జరిపిన దాడి నుంచి వీరిద్దరూ తప్పించుకున్నారు. తొలి రోజు జరిగిన చర్చలో ఖైదీలు – బందీల మార్పిడి, కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయానికి అనుమతి వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయని ఈజిప్ట్ ప్రభుత్వంతో సంబంధమున్న అల్-ఖహేరా న్యూస్ తెలిపింది.
గాజాలో కాల్పుల విరమణే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ఈ చర్చల్లో హమాస్ తన కీలక డిమాండ్లను ప్రవేశపెట్టింది. గాజా ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు గల అన్ని అడ్డంకులను అధిగమించాలని తాము కోరుకుంటున్నామని తెలిపింది. ‘శాశ్వత, సమగ్ర కాల్పుల విరమణ వుండాలి, గాజా నుండి ఇజ్రాయిల్ బలగాలు పూర్తిగా వైదొలగాలి, ఎలాంటి ఆంక్షలు లేకుండా మానవతా సాయం అందనివ్వాలి, నిర్వాసితులందరూ తమ ఇళ్లకు చేరాలి’, అని స్పష్టం చేసింది.
`గాజాలో సంపూర్ణ పునర్నిర్మాణ ప్రక్రియ తక్షణమే చేపట్టాలి. దీన్ని పాలస్తీనా జాతీయులతో కూడిన సాంకేతిక నిపుణుల బృందం పర్యవేక్షిం చాలి. ఖైదీల మార్పిడి ఒప్పందం న్యాయబద్ధంగా వుండాలని’ హమాస్ ప్రతినిధి ఫవ్జి బర్హౌమ్ చెప్పారు. నెతన్యాహు గతంలో జరిగిన చర్చలన్నింటినీ ఉద్దేశ్యపూర్వకంగా చెడగొట్టారని, ప్రస్తుత చర్చలైనా ఎలాంటి అవరోధాలు లేకుండా సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇజ్రాయిల్ బందీలు, పాలస్తీనా ఖైదీలను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని ట్రంప్ కూడా ఒత్తిడి తెస్తున్నారని అధ్యక్ష భవనం పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ చెప్పారు. ఒప్పందం కుదరడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ట్రంప్ సోమవారం ఓవల్ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. కొన్ని విషయాలకు హమాస్ అంగీకరిస్తోందని, అది చాలా ముఖ్యమని తెలిపారు.
ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెడుతూ ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికను అవకాశంగా తీసుకొని యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. రక్తపాతాన్ని నివారించి, శాంతికి దారి ఏర్పరచుకోవాలంటే శాశ్వత కాల్పుల విరమణ, విశ్వసనీయ రాజకీయ ప్రక్రియ అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
More Stories
భారత నాగరిక ఆత్మ సంరక్షకునిగా వందేళ్ల ఆర్ఎస్ఎస్
బాగ్రామ్ స్థావరంపై ట్రంప్ ప్రయత్నంకు వ్యతిరేకం
అత్యుత్తమ పరిశోధన కేంద్రంగా సమ్మక్క, సారక్క యూనివర్సిటీ