
దేశంలో 1,687 మందికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా సంపద ఉంది. అలాగే 358 మంది వద్ద ఎనిమిదిన్నర వేల కోట్ల సంపద పోగుపడి ఉంది. వీరందరి వద్ద కలిపి ఉన్న సంపద భారత జీడీపీలో దాదాపు సగానికి సమానమని హూరన్ ఇండియా రిచ్ తాజా జాబితా తెలిపింది.ఈ సంపద అంతా దాదాపుగా దేశంలోని కొన్ని ప్రాంతాలలోనే కన్పిస్తుంది. భారతదేశానికి చెందిన మిలియనీర్ కుటుంబాలలో సగానికి పైగా కుటుంబాలు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, గుజరాత్‌లోనే ఉండడం గమనార్హం.
తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా…వీటిని కూడా కలుపుకుంటే భారత వృద్ధిలో 90 శాతం ఈ పది రాష్ట్రాలలోనే మనకు కన్పిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలలోనే సంపద సృష్టి జరుగుతోంది. మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. హూరన్ నివేదికను పరిశీలిస్తే పరస్పర విరుద్ధమైన అంశాలు ఎన్నో కన్పిస్తాయి.
అది కేవలం సంపన్నుల జాబితా మాత్రమే కాదు. దేశంలో అభివృద్ధి ఎక్కడ కేంద్రీకృతమైంది, అది ఇంకా ఎక్కడ కన్పించడం లేదు అనే అంశాలను కూడా ఆ నివేదిక స్పృశించింది. సంపద ఎక్కడ ఉంటే అక్కడ అవకాశాలు లభిస్తాయని చెబుతుంటారు. మహారాష్ట్రలో వాణిజ్య రాజధాని ముంబయి ఉంది. ఆ రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా సంపద ఉన్న వారు 548 మంది. అంటే దేశంలో ఉన్న సంపన్నుల్లో సగం మంది మహారాష్ట్రలోనే ఉన్నారన్న మాట.
ఢిల్లీలో 223 మంది సంపన్నులు ఉండగా కర్నాటక, గుజరాత్, తమిళనాడు, తెలంగాణలో మిగిలిన వారు నివసిస్తున్నారు. దీనిని బట్టి అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మౌలిక సదుపాయాలు ఉంటాయి. పెట్టుబడిదారులకు విశ్వాసం కలుగుతుంది. ముంబయి లేదా బెంగళూరులో వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే పెట్టుబడిని సమీకరించడం సులభం. నిపుణులైన సిబ్బంది లభిస్తారు.
డబ్బు ఖర్చు చేసే వినియోగదదారులూ దొరుకుతారు. అదే ఇండోర్లోనో పాట్నాలోనూ వ్యాపారం చేస్తే అభివృద్ధి చెందడానికి చాలా కాలం పడుతుంది. ఏం తయారు చేస్తున్నామన్న దాని కంటే ఎక్కడ తయారు చేస్తున్నామన్నదే ముఖ్యమని ఓ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ యజమాని వ్యాఖ్యానించారు.
More Stories
ఈపీఎస్ కనీస పెన్షన్ రూ. 2,500కు పెంపు?
పెట్రోల్ వాహనాలతో సమానంగా విద్యుత్ వాహనాల ధరలు
అమెరికాతో సుంకాల సమస్య పరిష్కారం కావాల్సి ఉంది