పెట్రోల్ వాహనాలతో సమానంగా విద్యుత్ వాహనాల ధరలు

పెట్రోల్ వాహనాలతో సమానంగా విద్యుత్ వాహనాల ధరలు
ప్రస్తుతం పెట్రోలు వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి) ధరలు మరో 4 నుంచి నెలల్లో పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా మారనున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఆయన ఢిల్లీలో జరిగిన 20వ ఫిక్కీ హయ్యర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2025లో ఈ విషయాన్ని తెలిపారు. 
 
భారతదేశం ప్రస్తుత సంవత్సరానికి రూ. 22 లక్షల కోట్లను ఇంధన దిగుమతుల కోసం ఖర్చు చేస్తోంది. ఇది ఆర్థిక భారమే కాకుండా పర్యావరణానికి కూడా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. 4 నుంచి నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా మారతాయి. ఇది భారతదేశంలో క్లీన్ ఎనర్జీ విప్లవానికి పెద్ద అడుగుగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నం.1గా నిలపడం లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. “నేను రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లు, ఇప్పుడు అది రూ. 22 లక్షల కోట్లకు పెరిగింది” అని తెలిపారు.  ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 78 లక్షల కోట్లు, చైనా రూ. 47 లక్షల కోట్లు కాగా, భారత్ రూ. 22 లక్షల కోట్ల స్థాయిలో ఉందని ఆయన తెలిపారు. 
 
భారత రైతులు మొక్కజొన్న నుండి ఇథనాల్ తయారీ ద్వారా అదనంగా రూ. 45,000 కోట్లు ఆర్జించారు. ఇది గ్రీన్ ఎనర్జీ దిశగా ఒక పెద్ద అడుగు అని గడ్కరీ చెప్పారు.