కల్తీ దగ్గు మందు ఏపీకి సరఫరా కాలేదు

కల్తీ దగ్గు మందు ఏపీకి సరఫరా కాలేదు
 

మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో  12 మంది చిన్నారుల మరణాలకు దారితీసిన కల్తీ దగ్గు మందు సదరు కంపెనీ నుంచి రాష్ట్రానికి సరఫరా కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఔషధ దుకాణాల వారికి కానీ, ప్రభుత్వాసుత్రులకు కానీ సదరు కంపెనీ దగ్గు మందు పంపిణీ జరగలేదని వెల్లడించారు. తాజా పరిణామాలపై మంత్రి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలనా ఇంచార్జి డైరెక్టర్ జనరల్, రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ గిరీషా నివేదికలు అందచేశారు. 

 
కల్తీ దగ్గు మందు జాడ రాష్ట్రంలో లేనందున ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సూచనలు అనుసరించి, రెండేళ్లలోపు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబుకు సంబంధించి ద్రవరూపంలో వైద్యులు మందులు సూచించొద్దని ఆదేశాలు పంపాలని అధికారులకు
తెలిపారు.
 
“ఔషధ దుకాణాల వారికి సదరు కంపెనీ దగ్గు మందు సరఫరా జరిగినట్లు ఆనవాళ్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ల తనిఖీల్లో కనిపించలేదు.  సదరు కంపెనీ నుంచి దగ్గు మందు పంపిణీ జరిగినట్లు దుకాణాల వారి వద్ద ఇన్వాయిస్ లు కనిపించలేదు.  దగ్గు మందు బాక్సులు దుకాణాల్లో కనిపించలేదు.  డ్రగ్ ఇన్స్పెక్టర్ల ద్వారా తనిఖీల పరంపర ఇంకా జరుగుతూనే ఉంది. ఔషధ నియంత్రణ పరిపాలనా డైరెక్టర్ జనరల్ ప్రధాన కార్యాలయంలోని అధికార యంత్రాంగం నిత్యం పర్యవేక్షిస్తోంది” అని ఇంచార్జి డైరెక్టర్ జనరల్ (డిసి ఎ) గిరీషా ఆ నివేదికలో పేర్కొన్నారు.

“ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసేందుకు కొనుగోలుచేసే మందుల్లో సదరు కంపెనీ కల్తీ మందు లేదు. రాష్ట్రంలో 4 రకాల కంపెనీల దగ్గుమందులు వాడుతున్నాం. కాంబినేషన్ ఫార్ములేషన్ కాకుండా సింగిల్ మాలిక్యుల్ సిరప్ మా సంస్థ ప్రభుత్వాసుపత్రులకు పంపిణీ చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలలో కాంచీపురంకి చెందిన కంపెనీ (శ్రీశాన్ ఫార్మస్యూటికల్స్) నుంచి ‘కోల్డిఫ్’ దగ్గు మందు కాంబినేషన్ రూపంలో సరఫరా జరిగింది” అని  రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ గిరిషా తెలిపారు. ఈ క్రమంలో డైఇథిలిన్ గ్లెకాల్ నిర్దిష్ట ప్రమాణాల కంటే అధిక మోతాదులో వాడిన కల్తీ మందు ఆ రాష్ట్రాల్లో సరఫరా జరిగిందని చెప్పారు.

“భారత డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ ఆదేశాలను పంపించి, వైద్యులు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించాం. వీటి అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందో నివేదించాలని పేర్కొన్నాం. ఫార్మసిస్టులకు కూడా అవగాహన కల్పించాలని  సూచించినట్లు” రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ మంత్రికి పంపిన నివేదికలో పేర్కొన్నారు.