
అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. తన మోటెల్ బయట జరుగుతున్న వివాదాన్ని ఆపేందుకు వెళ్లి 51 ఏళ్ల రాకేశ్ ఇహబగన్ ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రాకేశ్ పిట్స్‌బర్గ్ లోని రాబిన్సన్ టౌన్‌షిప్‌లో మోటెల్ నడుపుతున్నారు.
శుక్రవారం సాయంత్రం ఆయన మోటెల్ ఎదుట ఉన్న పార్కింగ్‌లో గొడవ జరగడంతో దాన్ని ఆపేందుకు ఆయన బయటకు వెళ్లారు. ఎందుకు గొడవ పడుతున్నారని రాకేశ్ అడగడంతో నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో రాకేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు 37 ఏళ్ల స్టాన్లీ యుజెన్ వెస్ట్‌గా గుర్తించారు.
నిందితుడు అప్పటికే పార్కింగ్ వద్ద మరో యువతిపై కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు గత రెండు వారాలుగా రాకేశ్ నిర్వహిస్తోన్న మోటెల్ లోనే అద్దెకు దిగినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా గత నెల డాలస్ లోనూ ఇదే తరహా సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్థానికంగా ఓ మోటెల్ మేనేజర్‌గా పనిచేస్తోన్న భారత సంతతి వ్యక్తి చంద్రమౌళి నాగమల్లయ్యను సహోద్యోగి కత్తితో నరికి చంపిన సంఘటన తీవ్ర దుమారం రేపింది.
More Stories
సొంత ప్రజలపైనే బాంబులు వేసే దేశం పాకిస్తాన్
పాక్ టాపార్డర్ బ్యాటర్ సిద్రా అమిన్ పై ఐసీసీ చర్యలు
పదవి చేపట్టిన నెలకే ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ రాజీనామా