
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతం ప్రాంతంలో హిమపాతం, మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు 1,000 మందికి పైగా పర్వతారోహకులు ఎవరెస్ట్‌పై చిక్కుకుపోయారు. అక్టోబర్ నెలలో ఎవరెస్ట్ పర్వతంపై ఇలాంటి మంచుతుపాన్లు అసాధారణం. చైనా నేషనల్ డే ను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు వెళ్లారు.
మార్గ మధ్యలో ‘కర్మ వ్యాలీ’లో మంచుతుపాను వారిని ఇబ్బందులకు గురి చేసింది. టిబెట్ లో ఎవరెస్ట్ పర్వతం తూర్పువాలు వైపు రెండు రోజుల క్రితం నుంచి విపరీతంగా మంచు పడుతోంది. అది ఆదివారం నాటికి తుఫానుగా మారిపోయింది. ఈ ప్రభావంతో కర్మా వ్యాలీ, కాంగ్షుంగ్ వైపు ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్లు క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకుపోయారు. ట్రెక్కర్లు చిక్కుకుపోయినట్లు సమాచారం అందుకున్న వెంటనే చైనా అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
టిబెట్ బ్లూ స్కై రెస్క్యూ టీమ్, స్థానిక అధికారులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తుఫాను కారణంగా మంచు చరియలు విరిగిపడి మూసుకుపోయిన దారులను స్థానికుల సాయంతో క్లియర్ చేస్తున్నారు. రోడ్లపై, ట్రెక్కింగ్ మార్గాల్లో పేరుకుపోయిన భారీ మంచును తొలగించి, మంచులో చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే 350 మందికి పైగా ట్రెక్కర్లను సురక్షితంగా ‘ఖుడాంగ్’ అనే చిన్న పట్టణానికి తరలించినట్లు చైనా మీడియా వెల్లడించింది. మరో 200 మందిని దశలవారీగా కిందకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 16 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో వారంతా చిక్కుకుపోయినట్లు చైనా మీడియా పేర్కొంది. మిగిలిన ట్రెక్కర్లను సంప్రదించగలిగినట్లు, వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తీవ్రమైన చలి, హైపోథెర్మియా ముప్పు ఉండటంతో రెస్క్యూ టీమ్‌లు జాగ్రత్తగా పనిచేస్తున్నాయి. విపరీతమైన మంచు కురవడంతో చాలా టెంట్లు కూలిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.అక్టోబర్ నెలలో ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదని, ఇదంతా చాలా ఆకస్మికంగా జరిగిందని చెబుతున్నారు. సాధారణంగా పర్వతారోహకులు, హైకర్లు ఈ మార్గం నుంచే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ఎక్కువగా వెళ్తారు.
ప్రస్తుతం చైనాలో సెలవులు కావడం వల్ల ఈ రద్దీ మరింత పెరిగింది. అదే సమయంలో మంచు తుపాను సంభవించడం వల్ల వీరంతా పర్వతంపై చిక్కుకుపోయారు. తీవ్రమైన చలి కారణంగా హైకర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది హైకర్లు హైపోథెర్మియా బారినపడినట్లు రెస్క్యూ బృందం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు అనుమతులు నిలిపివేశారు.
More Stories
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కటక్‌లో కర్ఫ్యూ
రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు నిషేధం
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం