లక్షా 25 వేల డాలర్ల మార్క్‌ దాటిన బిట్‌కాయిన్

లక్షా 25 వేల డాలర్ల మార్క్‌ దాటిన బిట్‌కాయిన్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా 1,25,245.57 డాలర్ల (ఒక బిట్‌కాయిన్ విలువ రూ.1.11 కోట్లు) వద్ద ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది ఆగస్టు మధ్యలో నమోదైన 1,24,480 డాలర్ల రికార్డును ఇది అధిగమించింది. ఆదివారం మధ్యాహ్నం 2:54 గంటల సమయానికి కూడా బిట్‌కాయిన్ 1.55 శాతం లాభంతో 1,24,353.96 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

వరుసగా ఎనిమిది సెషన్ల పాటు లాభాల బాటలో పయనిస్తున్న బిట్‌కాయిన్, అమెరికా ఈక్విటీ మార్కెట్లలో సానుకూల పవనాలు, బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్‌లోకి (ఈటీఎఫ్) భారీగా నిధులు ప్రవహించడంతో ఈ రికార్డును అందుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్రిప్టో ఆస్తులలో పెట్టుబడులను సులభతరం చేసేలా నిబంధనలను సవరించడం, సంస్థాగత పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు మొగ్గు చూపడం వంటివి ఈ బుల్ రన్‌కు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 

 
స్టేబుల్‌కాయిన్లపై నిబంధనలను ఆమోదించడం, డిజిటల్ ఆస్తులకు అనుగుణంగా యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) నిబంధనలను మార్చడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపింది. మరోవైపు, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌పై నెలకొన్న అనిశ్చితి కారణంగా యూఎస్ డాలర్ విలువ ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే బలహీనపడింది. 
 
ఇది కూడా బిట్‌కాయిన్ పెరుగుదలకు పరోక్షంగా దోహదపడింది. సాధారణంగా బిట్‌కాయిన్ ‘హాల్వింగ్’ ఈవెంట్ తర్వాత ఇలాంటి దీర్ఘకాలిక ర్యాలీలు చోటుచేసుకుంటాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’ (డబ్ల్యూఎల్‌ఎఫ్) సంస్థ పాకిస్థాన్‌తో ఒక క్రిప్టోకరెన్సీ ఒప్పందంపై దృష్టి సారించిందని ‘డిస్ఇన్ఫో ల్యాబ్’ నివేదించింది.
 
పాకిస్థాన్ కొత్తగా ఏర్పాటు చేసిన క్రిప్టో కౌన్సిల్ సీఈఓగా ఉన్న బిలాల్ బిన్ సాఖిబ్, అదే సమయంలో డబ్ల్యూఎల్‌ఎఫ్‌కు కూడా సలహాదారుగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. జూన్ 2025లో పాకిస్థాన్ ప్రభుత్వం డబ్ల్యూఎల్‌ఎఫ్, బినాన్స్‌లతో కలిసి బ్లాక్‌చెయిన్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే.