పాక్‌ ను మట్టికరిపించిన భారత మహిళల జట్టు

పాక్‌ ను మట్టికరిపించిన భారత మహిళల జట్టు
అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా నాలుగో ఆదివారం పాకిస్థాన్‌కు భారత్‌ చేతిలో భంగపాటు తప్పలేదు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టు మూడుసార్లూ పాకిస్థాన్‌ జట్టును చిత్తుచేయగా తాజాగా అమ్మాయిలూ ఆ విజయ పరంపరను కొనసాగించారు.  కాగా వన్డేల్లో పాక్‌పై భారత్‌ ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఇది 12వ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌.. పాకిస్థాన్‌తో ‘నో షేక్‌హ్యాండ్‌’ విధానాన్ని కొనసాగించింది.
 
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థుల మధ్య కొలంబో వేదికగా జరిగిన పోరులో భారత్‌ 88 పరుగుల తేడాతో గెలిచి జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఉమెన్‌ ఇన్‌ బ్లూ బ్యాట్‌తో తడబాటుకు గురై నిర్ణీత ఓవర్లలో 247 పరుగులే చేయగలిగింది.  అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. సింద్రా అమిన్(81) ఓటమి నుండి తప్పించే ప్రయత్నం చేసిన మిలిగిన వారు సహకరించలేదు. దీంతో మరో 7ఓవర్లు ఉండగానే పాకిస్తాన్ ఆలౌట్ అయింది.
తెలుగుతేజం క్రాంతి గౌడ్ 3/20, దీప్తి శర్మ 3/45లు బాల్‌తో రాణించడంతో భారత్ 88 పరుగులతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ బ్యాటర్లలో సిడ్రా అ మిన్(81) నటాలియా పెర్వైజ్(33), సిడ్రా నవాజ్(14)లు తప్ప మరెవరూ రాణించలేకపోయారు. విగతావరంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో పాక్ ఘోర ఓటమిని మూటగట్లుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
 
జెమీమా రోడ్రిగ్స్‌ (32), ప్రతీకా రావల్‌ (31), దీప్తి శర్మ (25), స్మృతి మంధాన (23), స్నేహ రాణా (20), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (19) రన్స్‌ చేశారు. పాక్‌ బౌలర్లలో డయానా బేగ్‌ 4, ఫాతిమా సనా 2, సాదియా ఇక్బాల్‌ 2, రమీన్‌ షమీమ్‌, నష్రా సంధు ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఓపెనర్లు ప్రతీకా, మంధాన తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  అయితే, వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు.
నిలకడగా ఆడిన హర్మన్‌ప్రీత్‌ జట్టు స్కోరు 106 వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగింది. ఈ దశలో హర్లీన్‌, జెమీమా జట్టును ముందుకు నడిపించారు. అర్ధ శతకానికి చేరువైన డియోల్‌ను షమీమ్‌ వెనక్కి పంపడంతో 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే రోడ్రిగ్స్‌ కూడా ఔటైపోవడంతో భారత్‌ ఇబ్బందుల్లో పడింది.  తర్వాత వచ్చిన స్నేహ్ రాణా, దీప్తి శర్మ నిలకడగా ఆడినా చివరి వరకు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఆఖర్లో రిచా ఘోష్‌ మెరుపులతో భారత్‌ మంచి స్కోరే సాధించింది.
ఆసియా కప్‌లో పురుషుల జట్టు మాదిరే ఈ మ్యాచ్‌లోనూ ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య షేక్‌హ్యాండ్‌లు, మాటలు లేవు. టాస్‌ సందర్భంగా భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, పాక్‌ సారథి ఫాతిమా సనా కరచాలనం చేసుకోలేదు.