శ్రీశైలం ఆలయం అభివృద్ధి కోసం రూ.1,657 కోట్ల ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని కోరాలని దేవస్థానం అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ నెల 16న ప్రధానమంత్రి మోదీ శ్రీశైలం పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రిని కలవనున్నారు.
ఉజ్జయిని మహాకాళ్, కాశీ విశ్వనాథ్ కారిడార్‌లాగా శ్రీశైల క్షేత్రంలో కూడా ఒక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. అలానే ఆలయానికి చెందిన 5,362 ఎకరాల భూమి సమస్యను కూడా పరిష్కరించాలని ప్రధానిని కోరనున్నారు. కేంద్రం నుంచి కోరనున్న రూ.1,657 కోట్ల నిధులతో ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులు నిర్వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కొత్త క్యూకాంప్లెక్స్ కోసం రూ.90 కోట్లు, గంగాధర మండపం నుండి నందిమండపం వరకు సాలుమండపాల నిర్మాణానికి రూ.65 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నారు. అలానే కైలాస మానస సరోవరం-ఏనుగుల చెరువు కట్ట అభివృద్ధికి రూ.25 కోట్లు, కైలాస కళాక్షేత్రానికి రూ.25 కోట్లు ఖర్చు చేయనున్నారు. కొత్త ప్రసాదాల తయారీ పోటు నిర్మాణానికి రూ.13 కోట్లు, సామూహిక అభిషేక మండప నిర్మాణానికి రూ.10 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నారు. దేవస్థానం వర్క్‌షాప్ నుండి రుద్రపార్కు వరకు బ్రిడ్జి నిర్మాణానికి రూ.5 కోట్లు, సిద్ధరామప్ప కొలను అభివృద్ధి పనులకు రూ.95 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
కాగా, తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచించాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవదాయ, అటవీశాఖలతో ముఖ్యమంత్రి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షకు పవన్ కల్యాణ్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధికి పలు సూచనలు చేశారు. శబరిమలతో సహా ఇతర ప్రముఖ దేవాలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలాన్ని అభివృద్ధి చేద్దామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
తెలంగాణ పరిధిలో అమ్రాబాద్ నుంచి బ్రహ్మగిరి(దోమపెంట)వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఆత్మకూరు- దోర్నాల మధ్య నల్లమల అడవులు ఉండడంతో జాతీయ రహదారి నిర్మాణం ఊసే లేకుండా పోయింది. అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉండడంతో ఘాట్ రోడ్డు విస్తరణ పనులు చేయడం సమస్యగా మారింది.
More Stories
పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ అదృశ్యం!
`త్రిశూల’ వ్యూహంతో జనసేన బలోపేతంపై పవన్ దృష్టి
విశాఖ సముద్ర తీర కోత నివారణకు కేంద్రం రూ 222 కోట్లు