
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో కోట్లాది రూపాయల విరాళాలు చేరే పరకామణిలో చోరీ చేసిన సీనియర్ అసిస్టెంట్ కోయంబత్తూరు వెంకట రవికుమార్ గత ఏడాదిగా అదృశ్యమయ్యాడు. ఆయనకు ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. జగన్ హయాంలో జరిగిన ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వంలో మళ్లీ వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా ఎవరు దొంగతనం చేస్తే వారిపై కేసు నమోదు చేసి, పాత చోరీలను విచారించి, రికవరీ చేసి శిక్షిస్తారు. కానీ జగన్ పాలనలో మాత్రం టీటీడీ పరకామణిలో డాలర్లు దొంగిలించి పట్టుబడిన రవికుమార్‌పై కేసు నమోదు అయినా, కొద్దికాలానికే అతడిని “దాత”గా మార్చేశారు. చోరీ చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తుల్లో కొన్ని టీటీడీకి విరాళంగా ఇచ్చినట్లు చూపించి, అతడిని దాతగా చూపించారు.
2023 జూన్ 19న వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను “దాత రవికుమార్ ఇచ్చిన విరాళాలు”గా అంగీకరించారు. ఈ నిర్ణయం చోరీ కేసును సులభంగా మూసివేయడానికి కీలకంగా మారింది. రవికుమార్ 1990లలో తిరుమలలోని ఓ మఠంలో గుమస్తాగా ఉద్యోగం ప్రారంభించారు.
తరువాత టీటీడీ పరకామణి విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా నియమితులై, మూడు దశాబ్దాలుగా అదే విభాగంలో విదేశీ కరెన్సీ లెక్కలు వేసే బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలోనే విదేశీ కరెన్సీ నోట్లను చోరీ చేయడం అతనికి అలవాటైంది. ఏళ్ల పాటు దొంగిలించిన సొమ్ముతో తిరుపతి, రేణిగుంట, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో భారీ స్థిరాస్తులు కొన్నారు.
నెలకు రూ.40,000 జీతం పొందే ఉద్యోగి కోట్ల ఆస్తులు కూడబెట్టడం అందరికీ ప్రశ్నార్థకమైంది. 2023 ఏప్రిల్ 29న రవికుమార్ పరకామణిలో డాలర్లు చోరీ చేస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ సమయంలో “ఇది నా మొదటి తప్పు, ఇక మళ్లీ చేయను” అని వేడుకున్నాడు. అయినప్పటికీ కేసు నమోదై, మే 30న ఛార్జ్‌షీట్ దాఖలైంది.
కానీ విచారణ జరగకముందే 2023 సెప్టెంబర్ 9న లోక్‌అదాలత్‌లో కేసు రాజీ చేయించేశారు. విజిలెన్స్ ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు అప్పటి పాలకపక్ష నేతలు, ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. రవికుమార్ కేసు మూడు నెలల్లోనే ముగిసిపోవడం పరకామణి చరిత్రలోనే అతి వేగంగా పరిష్కరించిన “కేసు”గా నిలిచింది.
కేసు రాజీ అయిన కొన్ని నెలల తర్వాత రవికుమార్ కనపడకపోవడం కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఆయన ఎక్కడున్నారన్నది ఎవరికీ తెలియదు. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరకామణి చోరీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ ఈ కేసును తిరిగి విచారిస్తోంది.
రవికుమార్ విరాళంగా ఇచ్చిన ఆస్తులు కేవలం కొంత భాగం మాత్రమే. మిగిలిన ఆస్తులు పెద్దఎత్తున ఉన్నాయని, వాటిని వైఎస్సార్సీపీ కీలక నేతలు, అధికారులు తమ బినామీల పేర్లపై రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆస్తుల విలువ పది కోట్లలో ఉంటుందని సమాచారం. సీఐడీ ఇప్పుడు ఈ ఆస్తుల లావాదేవీలను, రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలిస్తోంది. పరకామణి చోరీ వ్యవహారంలో పాలుపంచుకున్న మాజీ అధికారులపై కూడా విచారణ జరగనుంది.
More Stories
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి
శతాబ్దిలో ఆర్ఎస్ఎస్, సిపిఐ … వారెక్కడ? వీరెక్కడ?
శబరిమలలో బంగారం అదృశ్యంతో ఇరకాటంలో సిపిఎం!