ఖలిస్థాన్ ఉగ్రవాదులకు నిధులపై కెనడా నిఘా

ఖలిస్థాన్ ఉగ్రవాదులకు నిధులపై కెనడా నిఘా

ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థల నెట్‌వర్క్‌కు నిధులు వస్తున్న మార్గాలపై కెనడా ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిఘా వేశాయి. కెనడాలోని సేవా సంస్థలకు వస్తున్న నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలతో కెనడా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కెనడా ఆర్థికశాఖకు చెందిన మోర్సో నివేదిక ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని హమాస్‌, హెజ్‌బొల్లాతో పోల్చింది. 

వేర్పాటువాదులు సేవా సంస్థల నిధులను ఉగ్ర కార్యకలాపాలకు వాడుతున్నారని ఆరోపించింది. స్థానిక రేడియో స్టేషన్‌ అధిపతి మణీందర్‌ ఆ దేశ ప్రధాని మార్క్‌ కార్నీ సహా పలువురు నాయకులకు కొన్నాళ్ల క్రితం లేఖ రాశారు. సామాజిక సేవకు వచ్చే విరాళాల దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. గత పాలకులు దీనిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని వెల్లడించారు. 

కెనడాలోని నాన్‌ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌లో ఉగ్ర స్లీపర్‌ సెల్స్‌ ఉంటున్నాయనే అనుమానాలు వ్యక్తంచేశారు. ఇప్పటికే బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ ఉగ్ర సంస్థ సభ్యుడు తల్వీందర్‌ సింగ్‌ పర్మర్‌ కుమారుడు నురిందర్‌ సింగ్‌ పర్మర్‌ కేసు ఈ కోవలోనే పరిశీలిస్తున్నారు. నురిందర్‌ కెనడాలోని నాన్‌ ప్రాఫిట్‌ సంస్థలోనే పనిచేస్తున్నాడు. ఆ సమయంలో అతడు తన పూర్తి పేరును వెల్లడించలేదని తేలింది. ఇతడికి కూడా బబ్బర్‌ ఖల్సాతో సంబంధాలున్నాయి.

ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఛారిటబుల్‌ సంస్థలకు వచ్చే నిధుల దుర్వినియోగంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు భారత్‌-కెనడా భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాయి. ఈ క్రమంలోనే కెనడా లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించింది.