
* లడఖ్ ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టం
లఢఖ్ కు రాష్ట్రహోదా కోసం డిమాండ్ చేస్తూ లేహ్ ప్రాంతంలో జనం నిరసనలు అల్లర్లకు దారితీయడం, నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో జాతీయ భద్రతా చట్టం క్రింద అరెస్ట్ అయిన లఢఖ్ ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపేవరకు తాను జైల్లోనే ఉంటానంటూ జైలు నుంచి ఓ సందేశం పంపారు. కాగా, తన భర్తను విడుదల చేయాలంటూ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జే ఆంగ్మో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.
లఢఖ్ ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై స్వతంత్య్ర దర్యాప్తు జరిపించాలని, లేదంటే తాను జైల్లోనే ఉండిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని వాంగ్‌చుక్ తన సందేశంలో హెచ్చరించారు. వాంగ్‌చుక్ ప్రస్తుతం జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. సోదరుడు కాత్సేతాన్ డోర్జే లేతో పాటు న్యాయవాది ముస్తఫా హాజీలు ఆయనను కలిసిన సందర్భంగా ఈ సందేశాన్ని పంపారు.
తాను శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నానని, తన కోసం ప్రార్థిస్తున్న వారికి ధన్యవాదాలు అని తన సందేశంలో వాంగ్‌చుక్ పేర్కొన్నారు. ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. లఢఖ్‌కు రాష్ట్రహోదా కోసం ప్రజలు, లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఏబీ), కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఏడీఏ) చేస్తున్న డిమాండ్‌లకు మద్దతిస్తున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా శాంతి, ఐక్యతను కాపాడుకోవాలని, అహింసా మార్గంలోనే మన పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించాలని ప్రజలకు సూచించారు. కాగా సోనమ్ వాంగ్‌చుక్ పిలుపుతోనే లేహ్‌లో ఆందోళనలు జరిగాయని ఆరోపించిన కేంద్రం జాతీయ భద్రతాచట్టం కింద ఆయనను అరెస్ట్ చేయించింది. ఈ చట్టం కింద అరెస్టయిన వ్యక్తిని విచారణ చేయకుండా 12 నెలలపాటు నిర్బంధించేందుకు చట్టం అనుమతిస్తుంది.
More Stories
కరూర్ తొక్కిసలాట వెనుక కుట్ర… బిజెపి ఆరోపణ
దగ్గు మందుతో చిన్నారుల మృతికి కారణమైన డాక్టర్ అరెస్ట్
‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్లు కాదు, శాంతిభద్రతల సమస్య