
కరూర్ ప్రాంతంలో ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. ఘటన తర్వాత తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
దీని వెనుక కుట్రకోణం కనిపిస్తోందని స్పష్టం చేస్తూ కరూర్‌లో ప్రణాళిక ప్రకారమే తొక్కిసలాటను సృష్టించారని ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్ ఆరోపణలు గుప్పించారు. విజయ్ ర్యాలీ నిర్వహించుకునేందుకు సరైన స్థలాన్ని కేటాయించలేదని ఆమె మండిపడ్డారు. ఈ ఘటన నిర్లక్ష్యం వల్లే జరిగిందని తమిళనాడు ప్రజలందరికీ తెలుసనీ, విజయ్ సభకు జనం ఎలా వస్తారో తెలిసి కూడా సరైన భద్రత కల్పించలేదని ఆమె ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా స్టాలిన్ తన మౌనాన్ని వీడాలని ఆమె కోరారు. అసలు తొక్కిసలాటకు ముందు పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేశారో చెప్పాలని బీజేపీ నేత డిమాండ్ చేశారు.
ఘటన సమయంలో పోలీసుల నిర్వహణలో లోపాలు, అనుమతుల ఆలస్యం, సమర్థవంతమైన ఏర్పాట్లు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంకేతాలని ఖుష్బూ ఆరోపించారు. అటు, విజయ్ కూడా ఈ ఘటనను రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తూ, సీబీఐ దర్యాప్తు కోరారు.
అయితే, మద్రాస్ హైకోర్టు ఈ ఘటనపై సిట్ దర్యాప్తును ఆదేశించింది. టివికె నాయకుల నిర్లక్ష్యాన్ని కోర్టు ఖండించింది. తొక్కిసలాట సమయంలో ఆ పార్టీ కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టలేదని, బాధితులను పరామర్శించకుండానే విజయ్ చెన్నైకు పరారైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా బీజేపీ స్పందించింది. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఎన్డీఏ ఎంపీల బృందాన్ని కరూర్ పంపింది. విచారణ చేపట్టిన ఈ బృందం తొక్కిసలాటకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించింది.
విజయ్‌తో అభిప్రాయభేదాలు ఉన్నా కరూర్ ఘటన వ్యవహారంలో ఆయనకు అండగా ఉంటామని బీజేపీ సీనియర్ నేత రాజా స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తమ విచారణను వేగవంతం చేసింది. కరూర్ సభ జరగడానికి కొన్ని గంటల ముందు విజయ్ ప్రచార రథం ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా ఆ ప్రచార రధాన్ని స్వాధీనం చేసుకొని, డ్రైవర్‌ను విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ విచారణ ప్రారంభిస్తుందని, ఈ విచారణ ద్వారా సిట్ నిజాన్ని వెలికితీస్తుందని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ హామీ ఇచ్చారు.‘ప్రతీ స్థాయిలోనూ జవాబుదారీతనం నిర్ణయమవుతుంది’ అని స్టాలిన్ తెలిపారు.
More Stories
స్వతంత్ర దర్యాప్తు జరిపేవరకు జైల్లోనే ఉంటా
దగ్గు మందుతో చిన్నారుల మృతికి కారణమైన డాక్టర్ అరెస్ట్
ఆత్మపరిశీలన, పునఃసమర్పణకు అవకాశంగా ఆర్ఎస్ఎస్ వందేళ్లు